Site icon HashtagU Telugu

Team India: తుది జట్టు కూర్పుపైనే అందరి చూపు

Team India T20

Team India T20

బంగ్లాదేశ్ టూర్ ను భారత్ వన్డే సిరీస్ తో ఆరంభించబోతోంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆదివారం ఉదయం 11:30 గంటలకు జరగనుంది. న్యూజిలాండ్‌ పర్యటనకు దూరంగా ఉన్న టీమిండియా సీనియర్లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో తుది జట్టు కూర్పుపైనే అందరి దృష్టీ ఉంది. వైఫల్యాల బాటలో ఉన్న పంత్‌ కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పంత్ ను పక్కన పెట్టి ఇషాన్ ను తుది జట్టులో ఆడించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. సంజూ శాంసన్ ను పక్కన పెట్టి పంత్ కు కివీస్ టూర్ లో అవకాశాలు ఇచ్చినా అతను మాత్రం గాడిన పడలేదు. దీంతో బంగ్లా టూర్ పంత్ కు కీలంక కానుంది.

మిగిలిన జట్టును చూస్తే సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం ఇచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంది. రజత్‌ పాటిదార్‌, రాహుల్‌ త్రిపాఠి, షాబాజ్‌ అహ్మద్‌, కుల్దీప్‌ సేన్‌ అవకాశం కోసం వేచి చూడాల్సిందే. ఓపెనర్లుగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌ బరిలోకి దిగడం ఖాయం కాగా, వన్‌ డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌, ఐదో ప్లేస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, ఆరో స్థానంలో రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్ల కోటాలో వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, పేసర్లుగా మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ బరిలోకి దిగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గాయంతో షమీ దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే షమీ స్థానంలో ఎంపికైవ ఉమ్రాన్ మాలిక్ కు ఈ సిరీస్ మంచి అవకాశంగా భావిస్తున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లతో సత్తా చాటిన మాలిక్.. జట్టుకు మాత్రం విజయాన్నందించలేకపోయాడు. వర్షం కారణంగా రద్దయిన మూడో వన్డేలో ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తం మీద పేస్ విభాగంలో సీనియర్లు లేకపోవడం ఇబ్బందే అయినా ఐపీఎల్ సత్తా చాటిన యువ బౌలర్లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.

Exit mobile version