Ind Vs WI 2nd T20: మరో విజయంపై టీమిండియా కన్ను

కరేబియన్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇవాళ రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుంది. సిరీస్‌లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 02:06 PM IST

కరేబియన్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇవాళ రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుంది. సిరీస్‌లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. సిరీస్ విజయానికి చేరవలో నిలవడమే టార్గెట్‌గా రెండో మ్యాచ్‌లో దూకుడుగా ఆడాలని ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఏ దశలోనూ కరేబియన్ టీమ్ పోటీనివ్వలేకపోయింది.

నిజానికి షార్ట్ ఫార్మాట్ అంటే చెలరేగిపోయే విండీస్ క్రికెటర్లు పేలవ ఫామ్‌తో నిరాశపరిచారు. దీంతో మ్యాచ్ పూర్తి వన్‌సైడ్‌గా సాగింది. ఈ నేపథ్యంలో రెండో టీ ట్వంటీలోనూ టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అయితే తొలి టీ ట్వంటలో భారత్ గెలిచినా కొన్ని లోపాలు అధిగమించాల్సి ఉంది. ఓపెనర్లు, ఫినిషర్లు ఆడుతున్నా మిడిలార్డర్ నిలకడగా రాణించలేకపోవడం మైనస్‌ పాయింట్. సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపించినా శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ విఫలమయ్యారు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు మిడిలార్డర్ పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అటు రవీంద్ర జడేజా కూడా పూర్తిస్థాయిలో సత్తా చాటాల్సిన పరిస్థితి ఉంది. కాగా ఫినిషర్ రోల్‌లో దినేశ్ కార్తీక్ అదరగొడుతుండడం టీమ్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్‌. మరోవైపు బౌలింగ్‌లో పేసర్లు భువనేశ్వర్, అర్షదీప్‌సింగ్‌ రాణిస్తుండగా.. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, అశ్విన్‌లే కీలకం కానున్నారు.

గత మ్యాచ్‌లో జడేజాతో పాటు వీరిద్దరూ అద్భుతంగా రాణించడంతో మరోసారి బౌలింగ్‌ పరంగా మనదే ఆధిపత్యం నిలిచే అవకాశముంది. ఇదిలా ఉంటే తమకు అచ్చొచ్చిన టీ ట్వంటీ ఫార్మాట్ లో కూడా తేలిపోవడం విండీస్‌కు మింగుడు పడటం లేదు. పవర్ హిట్టర్లు ఉన్నా.. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ను సమం చేయాలని నికోలస్ పూరన్ నాయకత్వంలోని విండీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఓపెనర్ల ప్రయోగాలు బెడిసికొడుతుండడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను టెన్షన్ పెడుతోంది. రెండో టీ ట్వంటీతోనైనా ఈ లోటు తీరుతుందేమో చూడాలి.