Team India: సఫారీలతో భారత్ కు సవాలే!

ఐపీఎల్ భారత క్రికెటర్లకే కాదు విదేశీ ఆటగాళ్లకు సైతం బాగా ఉపయోగపడుతోంది.

  • Written By:
  • Updated On - June 7, 2022 / 01:01 PM IST

ఐపీఎల్ భారత క్రికెటర్లకే కాదు విదేశీ ఆటగాళ్లకు సైతం బాగా ఉపయోగపడుతోంది. విదేశీ ప్లేయర్స్ ఇక్కడి పిచ్ లపై ఎలా ఆడాలో ఐపీఎల్ కారణంగా బాగానే నేర్చుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వైపాక్షిక సీరీస్ కోసం ఐపీఎల్ వారికి మంచి సన్నద్ధత ఇస్తోంది. అయిదు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఢిల్లీ వేదికగా గురువారం జరగనుంది. బిజీ షెడ్యూల్ కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సీరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో కే ఎల్ రాహుల్ ని సారథిగా ఎంపిక చేశారు. అలాగే విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ వంటి సీనియర్‌ ఆటగాళ్లకు కూడా సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.దీంతో ఐపీఎల్ లో రాణించిన పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో సఫారీ గడ్డపై ఎదురయిన పరాభవానికి టీమిండియా రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నా అది అంత ఈజీ కాదని అంచనా వేస్తున్నారు.
ఈ సిరీస్‌ కోసం ఎంపికయిన సఫారీ జట్టులో చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్‌ 2022 సీజన్ లో ఆడిన వారే ఉన్నారు. వికెట్ కీపర్ క్వింటన్‌ డికాక్‌, టాపార్డర్ ఆటగాడు మారక్రమ్‌, మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్‌ మిల్లర్‌, సీనియర్ పేసర్ కగిసో రబాడ, ఫాస్ట్‌ బౌలర్‌ జానేసన్‌ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం వీరంతా భీకర ఫామ్‌లో ఉన్నారు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ గా బరిలోకి దిగిన క్వింటన్‌ డికాక్‌ 15 మ్యాచుల్లో 508 పరుగులు చేసాడు. అలాగే సీజన్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన డేవిడ్‌ మిల్లర్‌ 16 మ్యాచ్‌ల్లో 481 పరుగులు సాధించాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఐడెన్‌ మారక్రమ్‌ ఆడిన 14 మ్యాచుల్లో 381 పరుగులు సాధించాడు. అలాగే ఈసారి ఐపీఎల్ లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున బరిలోకి దిగిన రబాడ 13 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ఆడడం ద్వారా భారత పిచ్ లపై పూర్తి అవగాహన ఉండడం కూడా వారికి అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఈ క్రమంలో వీరిని కట్టడి చేయడం టీమిండియాకు సవాలే. టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం తమ జట్టు కూర్పును పరిశీలించిచుకోవాలని సౌతాఫ్రికా కూడా భావిస్తుండడంతో సీరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.