తొలిరోజు మనదే

బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు భారత్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగిన వేళ బంగ్లా 227 పరుగులకే ఆలౌటైంది.

  • Written By:
  • Updated On - December 23, 2022 / 09:44 AM IST

బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు భారత్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగిన వేళ బంగ్లా 227 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టును భారత పేసర్లు కట్టడి చేశారు. మొమినుల్ హక్‌ 84 , ముష్పికర్ రహీమ్ 26, లిట్టన్ దాస్ 25 తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. మొమినుల్ హక్‌ హాఫ్ సెంచరీతో పోరాడినా.. మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సపోర్ట్ లేకపోయింది. బంగ్లా బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోనివ్వకుండా భారత బౌలర్లు రాణించారు. ఉమేశ్ యాదవ్‌ తన ఫామ్ కొనసాగించగా.. అశ్విన్‌ మరో ఎండ్ నుంచి తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. ఉమేశ్ యాదవ్ 4 , అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. జైదేవ్ ఉనాద్కట్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ 14, కేఎల్‌ రాహుల్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో మార్పు చేసింది. తొలి టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్‌ యాదవ్‌ను పక్కకు పెట్టింది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్‌.. మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. అయితే పూర్తి పేస్ పిచ్ కాకున్నా కుల్దీప్‌ను తప్పించడంపై మాజీలు విమర్శలు గుప్పించారు. బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినప్పటకీ… తొలి టెస్టులో 188 రన్స్‌తో ఘనవిజయం సాధించింది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్ రేసులో టీమిండియా మరింత ముందంజ వేస్తుంది.