Rohit Sharma: గల్లీ క్రికెట్ ఆడిన హిట్ మ్యాన్

సచిన్ టెండూల్కర్ నుంచి నేటి యశ్ ధుల్ వరకు అందరూ గల్లీ క్రికెట్ ఆడి వచ్చిన వారే.

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 07:20 AM IST

సచిన్ టెండూల్కర్ నుంచి నేటి యశ్ ధుల్ వరకు అందరూ గల్లీ క్రికెట్ ఆడి వచ్చిన వారే. ఎంత అంతర్జాతీయ క్రికెట్ లో ఆడినా…తమ చిన్న నాటి గల్లీ క్రికెట్ మాత్రం మర్చిపోలేరు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ గల్లీ క్రికెట్ ఆడాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముంబైలోని వర్లీ ప్రాంతంలో గల్లీ ప్రాక్టీస్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముంబైలోని బాండ్రాలో నివాసముండే రోహిత్‌ శర్మ వర్లీ ప్రాంతం వైపు వెళ్తుండగా కొందరు కుర్రాళ్లు రోడ్డుపై క్రికెట్‌ ఆడుతూ కనిపించారు. ఇది చూసిన రోహిత్‌ వెంటనే కారు దిగి వారితో కలిసి క్రికెట్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు ప్రాక్టీస్‌ దొరకదనుకున్నాడో ఏమో కాని అక్కడి కుర్రాళ్లకు కూడా ఆవకాశం ఇవ్వకుండా చాలా సేపు బ్యాట్‌ పట్టుకుని కనిపించాడు. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అక్కడున్నవారందరినీ అలరించాడు. అక్కడ ఉన్నంతసేపు రోహిత్‌ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా రోహిత్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడనీ కామెంట్ చేస్తున్నారు. కాగా
విరాట్ కోహ్లీ నుంచి ఈ ఏడాది ఆరంభంలో టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకి.. టెస్టు కెప్టెన్‌గా ఇదే మొదటి ఇంగ్లాండ్ పర్యటన. గత ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్ గడ్డపై పర్యటించిన భారత్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌లాడి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ.. ఐదో టెస్టు ముంగిట భారత జట్టులో కరోనా కేసులు రావడంతో ఆ మ్యాచ్‌ని వాయిదా వేశారు. తాజాగా జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆ ఐదో టెస్ట్ జరగనుంది.