Team India: అసలు టార్గెట్ ముందుంది.. సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసిన కెప్టెన్ , కోచ్!

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన దాయాదుల సమరంలో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 05:44 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన దాయాదుల సమరంలో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ కంటే అతి పెద్ద మ్యాచ్ ఇదే అన్న అంచనాలను నిజం చేస్తూ చివరి వరకూ ఉత్కంఠ ఊపేసింది. భారత్ విజయంతో దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అటు టీమిండియా ఆటగాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరోజు ముందే దివాలీ అంటూ అందరూ సంబరపడ్డారు. తర్వాతి రోజు దీపావళి పండుగను మంచి పార్టీతో సెలబ్రేట్ చేసుకోవడానికి టీమిండియా కూడా ప్లాన్ చేసింది. అయితే సిడ్నీలో గ్రాండ్‌గా దీపావళి సెలబ్రేట్‌ చేసుకోవాలని భావించిన టీమ్ చివరి నిమిషంలో దానిని రద్దు చేసుకుంది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లి సూచన మేరకు ఆటగాళ్లు పార్టీ ఆలోచన విరమించుకున్నారు.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో సిడ్నీకి చేరుకున్న అనంతరం ఎవరికి వారుగా ఫ్యామిలీతో డిన్నర్‌కు వెళ్లి సరదాగా గడిపారు.
ట్రోఫీ గెలవాలన్న లక్ష్యం మీద దృష్టి సారించాలని ద్రావిడ్, రోహిత్ ఆటగాళ్లకు చెప్పిన విషయాన్ని సపోర్టింగ్ స్టాఫ్ లో ఒకరు వెల్లడించారు. టోర్నమెంట్‌ ఇప్పుడే మొదలైంది కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఆడాలని సూచనలు వచ్చాయన్నారు. మరీ ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం లేదు. మన ప్రధాన లక్ష్యం ట్రోఫీ గెలవడమే అంటూ ఈ సందర్భంగా యువ ఆటగాళ్లతో రోహిత్, కోహ్లీ చెప్పినట్టు సమాచారం. భారత్ తన తర్వాతి మ్యాచ్ లో గురువారం నెదర్లాండ్స్ తో తలపడుతుంది.