Team India : రెండో వన్డేలో నమోదైన రికార్డులివే

కరేబియన్ టూర్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో వన్డేలో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్‌ తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 03:43 PM IST

కరేబియన్ టూర్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో వన్డేలో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్‌ తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ భారీ షాట్లతో అదరగొట్టాడు. కేవలం 35 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 64 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ అరుదైన రికార్డు కూడా అందుకుంది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్‌ నిలిచింది. 2006 నుంచి ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 12 వన్డే సిరీస్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించిన పాకిస్తాన్‌ రెండో స్థానంలో ఉంది. మరోవైపు మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన అక్షర్ పటేల్ కూడా రికార్డుల మోత మోగించాడు. 17 ఏళ్ళ క్రితం ధోనీ నెల‌కొల్పిన అరుదైన రికార్డును అక్షర్ ప‌టేల్ అధిగ‌మించాడు. వ‌న్డే క్రికెట్‌లో ల‌క్ష్య ఛేద‌న‌కు సంబంధించి ఏడు లేదా అంత‌కంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్ దిగి అత్యధిక సిక్సర్లు కొట్టిన భార‌త క్రికెటర్‌గా కొత్త రికార్డు నెల‌కొల్పాడు. గ‌తంలో 2005లో జింబాబ్వేపై ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగి మూడు సిక్సర్లు కొట్టాడు. ధోనీ రికార్డును గతంలో యూసఫ్ పఠాన్ సమం చేశాడు. తాజాగా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వన్డేలో ఐదు సిక్సర్లతో అక్షర్ ప‌టేల్ ధోనీ, యూసుఫ్ రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. అలాగే విండీస్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ సాధించిన రెండో భారత క్రికెట‌ర్‌గానూ అక్షర్ ప‌టేల్ రికార్డు నెలకొల్పాడు. అక్షర్‌కు వ‌న్డేల్లో ఇదే తొలి హాఫ్ సెంచ‌రీ. మరోవైపు వెస్టిండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌ కూడా అరుదైన ఘనత సాధించాడు. తన వన్డే కెరీర్‌లో 100వ మ్యాచ్‌ ఆడిన హోప్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా 100వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 10 ఆటగాడిగా హోప్‌ నిలిచాడు.