India Vs SA: ఇక సఫారీలతో సమరం

టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాపై సీరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉంది.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 10:45 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాపై సీరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. కంగారులతో సీరీస్ ముగియడంతో ఇప్పుడు సౌతాఫ్రికా తో సమరానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సఫారీ జట్టు భారత్ చేరుకోగా…ఈ టూర్ లో మూడు టీ ట్వంటీలు , మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి టీ ట్వంటీ తిరువనంతపురం వేదికగా బుధవారం జరుగుతుంది.

దీనికోసం ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆడే చివరి సీరీస్ ఇదే. అక్టోబర్ 2న గౌహతీలో రెండు టీ ట్వంటీ, అక్టోబర్ 4న ఇండోర్‌లో మూడో టీ ట్వంటీ జరుగుతాయి. ఇదిలా ఉంటే సౌతాఫ్రకాపై స్వదేశంలో భారత్ ఇప్పటి వరకూ టీ ట్వంటీ సీరీస్ గెలవలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై టీ20 సిరీస్‌లు గెలిచిన భారత జట్టు ఇప్పటిదాకా సౌతాఫ్రికాపై మాత్రం టీ20 సిరీస్ నెగ్గలేకపోయింది.

ఇంతకుముందు 2015,2019, 2022ల్లో సౌతాఫ్రికా జట్టు, భారత్‌లో పర్యటించింది. ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచులు జరిగినా, ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లుగానే జరిగాయి తప్ప సిరీస్‌లు జరగలేదు. 2015లో భారత పర్యటనకి వచ్చిన సౌతాఫ్రికా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టును 2-0 తేడాతో చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మకు అరుదైన అవకాశం ఎదురు చూస్తోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు సఫారీలపై కూడా సిరీస్ గెలిస్తే మరింత జోష్ తో ఆస్ట్రేలియా బయలుదేరడం ఖాయమని చెప్పొచ్చు.