గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండో సారి గెలిచినప్పుడు టీమిండియా అంచనాలు బాగా పెరిగాయి. కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు ఖాయమంటూ అభిమానులు సంబరపడ్డారు. దీనికి తోడు ఆసియాకప్, టీ ట్వంటీ ప్రపంచకప్ ఉండడంతో వారి అంచనాలు రెట్టింపయ్యాయి. దీనికి తగ్గట్టుగానే ఏడాది ఆరంభం నుంచీ ద్వైపాక్షిక సిరీస్ లలో అదరగొట్టింది టీమిండియా.
టెస్టులు, వన్డేలు, టీ ట్వంటీల్లో సిరీస్ విజయాలను అందుకుంది. అయితే మెగా టోర్నీల్లో మాత్రం భారత్ చతికిలపడింది. టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు జరిగిన ఆసియాకప్ లో సైతం టీమిండియా ఫ్లాప్ షో ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఈ టోర్నీల్లో అద్భుతమైన రికార్డున్న భారత్ సూపర్ 4లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. పాకిస్థాన్ పై విజయంతో ఆసియాకప్ ను ఘనంగా ఆరంభించిన రోహిత్ సేన తర్వాత శ్రీలంక, పాక్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.
తర్వాత టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారీ అంచనాలతో అడుగుపెట్టింది టీమిండియా. అంచనాలకు తగ్గట్టుగానే మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించి టైటిల్ వేటను ఘనంగా మొదలు పెట్టింది. మధ్యలో సౌతాఫ్రికాపై ఓడినా.. నెదర్లాండ్స్ , బంగ్లాదేశ్ , జింబాబ్వేలపై విజయాలతో సెమీస్ కు చేరింది. అయితే కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 10 వికెట్ల తేడాతో ఘోరపరాభవాన్ని చవిచూసిన రోహిత్ సేన అభిమానులను నిరాశపరుస్తూ సెమీస్ లోనే నిష్క్రమించింది. దీంతో 2022లో రెండు టోర్నీలు భారత్ కు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
అయితే ఓవరాల్ గా టీమిండియా ప్రదర్శన పర్వాలేదనిపించింది. మెగా టోర్నీల్లో విఫలమైనా ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం సత్తా చాటింది. 2022లో నాలుగు టెస్ట్ సిరీస్ లు ఆడిన భారత్ రెండింటిలో విజయం సాధించి.. ఒక సిరీస్ ను చేజార్చుకుంది. మరో సిరీస్ ను డ్రాగా ముగించింది. శ్రీలంకపై సిరీస్ ను 2-0తో గెలిచిన భారత్ తర్వాత సౌతాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ తో గత ఏడాది మిగిలిన ఏకైక టెస్టులోనూ ఓడిపోవడంతో సిరీస్ డ్రాగాముగిసింది. అయితే ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
అటు వన్డే ఫార్మాట్ లో మెరుగ్గా రాణించింది టీమిండియా. మొత్తం 8 వన్డే సిరీస్ లు ఆడిన భారత్ ఐదింటిలో గెలిచి మూడు చేజార్చుకుంది. ఓవరాల్ గా 24 మ్యాచ్ లలో 14 విజయాలు, 8 ఓటములు చవిచూసిన రోహిత్ సేన.. రెండింటిలో ఫలితం తేలలేదు. వెస్టిండీస్ పై రెండు సిరీస్ లు గెలిచిన భారత్ ఇంగ్లాండ్ , సౌతాఫ్రికా, జింబాబ్వేలపై ఒక్కో సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ , బంగ్లాదేశ్ లపై సిరీస్ లను కోల్పోయింది. ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పై ఓటమి అభిమానులను నిరాశపరిచింది.
ఇక టీ ట్వంటీ సిరీస్ లలోనూ నిలకడగా రాణించింది. ఓవరాల్ గా 2022లో 40 టీ ట్వంటీలు ఆడిన టీమిండియా 28 మ్యాచ్ లలో విజయం సాధించింది. 10 మ్యాచ్ లలో ఓటమి పాలవగా.. ఒకటి టై, మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే ఆసియాకప్ , టీ ట్వంటీ ప్రపంచకప్ లలో మాత్రం భారత్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం అదరగొట్టిన టీమిండియా మెగా టోర్నీల్లో ఫ్లాప్ షో కనబరిచింది.