Site icon HashtagU Telugu

India vs Australia: టార్గెట్ నెంబర్ 1.. ఢిల్లీ వేదికగా భారత్, ఆసీస్ రెండో టెస్ట్

Ind vs Aus

Resizeimagesize (1280 X 720) (1) 11zon

నాగ్‌పూర్‌లో ఇన్నింగ్స్ విజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అదిరిపోయే విజయంతో ఆరంభించిన టీమిండియా (India) ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది. నేటి నుంచి ఢిల్లీ (Delhi) వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో భారత్ స్పిన్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన కంగారూలు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బలాబలాల పరంగా, గత రికార్డుల పరంగా టీమిండియాదే పై చేయిగా ఉంది. నాగ్‌పూర్‌లో రోహిత్ సేన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.

కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్ అదరగొట్టారు. అటు బౌలింగ్‌లో స్పిన్నర్లు అశ్విన్, జడేజా కంగారూలను కంగారెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి స్పిన్నర్లపైనే అంచనాలున్నాయి. కాగా ఈ మ్యాచ్‌తో సీనియర్ బ్యాటర్ చటేశ్వర పుజారా కెరీర్‌లో 100వ టెస్ట్ మైలురాయిని అందుకోనున్నాడు.

రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ నిరూపించుకొని జట్టుతో చేరిన అయ్యర్‌.. తొలి టెస్టులో ఆడిన సూర్యకుమార్‌ స్థానంలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అయితే తొలి టెస్టులో విఫలమైన కేఎల్‌ రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలనే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డుంది. ఢిల్లీ వేదికగా ఆడిన చివరి మూడు టెస్టుల్లో కలిపి కోహ్లీ 467 పరుగులు చేయగా.. సగటు 77.83గా ఉంది.

Also Read: Girl attack: సెల్ఫీ కోసం క్రికెటర్‌పై అమ్మాయి దాడి… నెట్టింట్లో వీడియో వైరల్!

మరోవైపు సిరీస్‌లో వెనుకబడకుండా ఉండాలంటే ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం కావాల్సిందే. తొలి మ్యాచ్‌లో అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క ఆసీస్ బ్యాటర్ రాణించలేదు. భారత స్పిన్నర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు ఆసీస్ బ్యాటర్లు. స్పిన్‌కు సిద్ధమయ్యే భారత్‌కు వచ్చామంటూ ఆ జట్టు కెప్టెన్ కాన్ఫిడెంట్‌గా చెప్పినా.. మైదానంలో మాత్రం ఆసీస్ తేలిపోయింది. దీంతో స్పిన్ బలహీనతను అధిగమిస్తే తప్ప టీమిండియా జోరును అడ్డుకోవడం కంగారూలకు కష్టమే. ఇదిలా ఉంటే సహజంగానే ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై స్పిన్నర్లు రాణిస్తారు. ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజులూ బ్యాటర్లు రాణించినా.. క్రమంగా స్పిన్‌కు అనుకూలిస్తుంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్లూ స్పిన్ బలంతోనే బరిలోకి దిగనున్నాయి. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డుంది. ఇక్కడ గత 36 ఏళ్ళుగా మన జట్టు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. ఓవరాల్‌గా భారత్‌ 34 టెస్టులు ఆడగా.. అందులో 13 మ్యాచ్‌లు గెలుపొందింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ గడ్డపై ఆసీస్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకటి మాత్రమే గెలిచింది. కాగా రెండో టెస్టులోనూ గెలిస్తే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌సేన అగ్రస్థానానికి చేరుకుంటుంది.