Tamim Iqbal: రిటైర్మెంట్ పై తమీమ్ ఇక్బాల్ యూటర్న్

వన్డే ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుంటే అన్ని జట్లూ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్

Tamim Iqbal: వన్డే ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుంటే అన్ని జట్లూ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్…అతని నిర్ణయం బంగ్లా క్రికెట్ బోర్డుకే కాదు ఫ్యాన్స్ కు కూడా షాకిచ్చింది. అయితే ఒక్కరోజులోనే మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ప్రధాని జోక్యంతోనే అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలు , తమ దేశ ప్రధానితో మాట్లాడిన తర్వాత తమీమ్ ను ఆమె పిలిపించారని సమాచారం. దీనిపై తమీమ్ కూడా స్పందించాడు.

ప్రధాని షేక్ హసీనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారని, ఎవరైనా చెబితే పట్టించుకునేవాడిని కాదని, సాక్షాత్తూ ప్రధాని కోరితే కాదనలేకపోయానని తమీమ్ చెప్పాడు. నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారన్నాడు. ఆమె చెప్పినట్టే మానసికంగా సిద్ధమైన తర్వాత గ్రౌండ్ లో అడుగుపెడతానని చెప్పాడు. బంగ్లాదేశ్ తరఫున తమీమ్ 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 15 వేలకుపైగా పరుగులు చేశాడు. అయితే గురువారం అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు.

16 ఏళ్లుగా తనకు వెన్నంటి నిలిచిన ఫ్యాన్స్, బంగ్లా క్రికెట్ బోర్డుకు ఈ సందర్భంగా తమీమ్ థ్యాంక్స్ చెప్పాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ తమీమ్ కంటతడి పెట్టాడు. తమీమ్ ఇక్బాల్ ఫిబ్రవరి, 2007లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఆ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇండియాను బంగ్లాదేశ్ ఓడించడంలో తమీమ్ దే కీరోల్. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. వన్డేల్లో తమీమ్ 14 సెంచరీలు సహా 8313 పరుగులు, 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు చేశాడు. కాగా తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో బంగ్లాదేశ్ అభిమానులు సంతోషపడుతున్నారు.

Read More: Chilakada Dumpa Poorilu: ఎంతో టేస్టీగా ఉండే చిలగడదుంపల పూరి.. తయారు చేయండిలా?