T20 World Cup 2026: టీమ్ ఇండియా ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ముమ్మరంగా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారత జట్టు న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు తమ స్క్వాడ్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమ్ మేనేజ్‌మెంట్ తమ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం.
భారత జట్టు స్క్వాడ్‌లో మార్పులు?
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ మెగా టోర్నమెంట్ కోసం జనవరి 31 వరకు ఫైనల్ స్క్వాడ్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం భారత జట్టులో పెద్దగా మార్పులు అవసరం లేదనిపిస్తున్నప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఒకవేళ న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌లలో ఆయన విఫలమైతే కెప్టెన్సీ మార్పుపై చర్చలు మరింత ఊపందుకోవచ్చు. బీసీసీఐకి ఇంకా సమయం ఉండటంతో తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
Also Read: రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?
సాధారణంగా బీసీసీఐ పెద్దగా మార్పులు చేయదు
ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బీసీసీఐ సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు మొదట ఏ జట్టును ఎంపిక చేస్తే దాదాపు అదే జట్టుతో టోర్నమెంట్‌లోకి వెళ్తుంది. 2026 ప్రపంచ కప్ విషయంలో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చు. అయితే ఇతర దేశాలను గమనిస్తే పాకిస్థాన్ ఇప్పటివరకు తమ ఫైనల్ టీమ్‌ను ప్రకటించకుండా వేచి చూస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో కూడా జనవరి 31 లోపు మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో మార్పులకు తావు లేదు. ఎవరైనా గాయపడితే తప్ప వారి స్క్వాడ్ మారదు.
