టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టైటిల్ మ‌న‌దే!!

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభం అంతగా కలిసి రాలేదు. 31 పరుగుల వద్ద ఫిన్ అలెన్ రూపంలో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (1) అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.

Published By: HashtagU Telugu Desk
World Champions

World Champions

World Champions: భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో భారత్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసి తన మూడవ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిషన్ అర్ధసెంచరీలతో మెరిశారు. దీంతో భారత జట్టు భారీ స్కోరు సాధించగా, ఆ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు చేతులెత్తేసింది. చివరికి భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ల విధ్వంసం

భారత్ తరఫున సంజూ శాంస‌న్ 46 బంతుల్లో 89 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. సంజూ, అభిషేక్ శర్మ కలిసి మొదటి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

Also Read: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతను కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు సాధించాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్ దూబే 8 బంతుల్లో 26 పరుగులు చేయడంతో, భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌కు తప్పని ఓటమి

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫిన్ అలెన్ రూపంలో కివీస్‌కు మొదటి షాక్ తగిలింది. ఆ వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (2 బంతుల్లో 1 రన్) అవుట్ కావడంతో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది.

అయితే, ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక వైపు క్రీజులో నిలబడి పోరాడాడు. కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ పోరాటం జట్టును గెలిపించడానికి సరిపోలేదు. మిగిలిన బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు, మార్క్ చాప్‌మన్ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. చివరకు న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

  Last Updated: 08 Mar 2026, 10:57 PM IST