టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా నేడు పాకిస్తాన్ తో తలపడనుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోని విఖ్యాత స్టేడియం ఎంసిజి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు లక్ష మంది ఈ మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైన్నే ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి గతేడాది ప్రపంచ కప్ ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో టీమిండియా ఉంది. ఈ గ్రేట్ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. పాకిస్తాన్ జట్టుకు కేప్టెన్ గా ఆజం బాబర్ వ్యవహరిస్తున్నాడు.
గతేడాది వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ లు ఆసియా కప్ 2022లో జరిగాయి. ఆ టోర్నీలో భారత్ విజయం సాధించింది. అదే సమయం సూపర్ 4 లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఈ రెండు మ్యాచ్ లు కూడా చివరి ఓవర్ వరకు పోరాడాయి. ఇవాళ్టి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
కాగా గత కొన్నిరోజులుగా మెల్ బోర్న్ లో వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా వర్షం ముప్పు ఉందనే వార్తలు వస్తున్నాయి. లా నినా ప్రభావంతో ఆస్ట్రేలియా వ్యాప్తంగా అక్టోబర్ చివరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ పేర్కొంది. అయితే రాత్రి 7గంటల నుంచి 11గంటల వరకు వర్షం పడే అవకాశం లేదని రాడర్ పేర్కొంది. కానీ అక్కడి వాతావరణ శాఖ మాత్రం 20శాతం వర్షం కురిసే సూచన ఉన్నట్లు వెల్లడించింది.