Site icon HashtagU Telugu

Champions League: క్రికెట్ అభిమానుల‌కు మ‌రో శుభ‌వార్త‌.. ఛాంపియన్స్ లీగ్ టీ20 రీ-ఎంట్రీ..!

Champions League T20

Champions League T20

Champions League: క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త. ఛాంపియన్స్ లీగ్ టీ20 (Champions League) మళ్లీ తిరిగి రాబోతోంది. ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం.. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 2026లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరిసారిగా 2014లో జరిగిన ఈ లీగ్, పదేళ్ల నిరీక్షణ తర్వాత వివిధ దేశాల టీ20 ఫ్రాంచైజీలు ఒకే టోర్నమెంట్‌లో తలపడనున్నాయి.

CLT20 రీ-ఎంట్రీకి అంతర్జాతీయ మద్దతు

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించిన వివరాల ప్రకారం.. సింగపూర్‌లో జరుగుతున్న ఐసీసీ (ICC) సమావేశంలో పలు దేశాలు ఛాంపియన్స్ లీగ్ టీ20ని తిరిగి ప్రారంభించడానికి మద్దతు తెలిపాయి. 2008లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ టోర్నమెంట్‌ను 2014లో ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడంతో నిలిపివేశారు. అయితే, ఇప్పుడు ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇది తిరిగి వస్తే అభిమానులు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి తమ అభిమాన ఆటగాళ్లను మళ్లీ వారి ఐపీఎల్ జట్టు జెర్సీలలో ఛాంపియన్స్ లీగ్‌లో చూడగలుగుతారు.

Also Read: UPI Processing: డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా భార‌త‌దేశం!

పేరు మార్పు, ఫార్మాట్‌లో మార్పులు?

నివేదిక ప్రకారం.. ఛాంపియన్స్ లీగ్ టీ20 పేరు మారే అవకాశం ఉంది. దీనిని బహుశా వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ అని పిలవొచ్చు. అంతేకాకుండా ప్రస్తుత చర్చల ప్రకారం ఈ టోర్నమెంట్‌లో 6 జట్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐసీసీ సమావేశంలో షెడ్యూల్, ఫార్మాట్, సమయం గురించి కూడా చర్చించినట్లు ఒక మూలం పీటీఐ (PTI)కి తెలిపింది. ఈ సందర్భంగా ఎమిరేట్స్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ది హండ్రెడ్, SA20, MLC, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రముఖ టీ20 లీగ్‌ల సీఈఓలను కూడా సమావేశానికి ఆహ్వానించారు.

ఛాంపియన్స్ లీగ్ టీ20 పాత ఫార్మాట్

ఛాంపియన్స్ లీగ్ టీ20ని UEFA ఛాంపియన్స్ లీగ్‌ను ఆదర్శంగా తీసుకుని రూపొందించారు. UEFAలో వివిధ దేశాల్లో జరిగే లీగ్‌ల టాప్ జట్లు ఆడ‌తాయి. అదే విధంగా క్రికెట్‌లో కూడా ఇలాంటి ఆలోచనను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ టీ20 లీగ్‌లకు చెందిన జట్లకు పాల్గొనే అవకాశం ఇచ్చారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ గతంలో అత్యంత విజయవంతమైన ఛాంపియన్స్ లీగ్ టీ20 జట్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లు రెండేసి సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.