T Natarajan: నట్టూ బుల్లెట్ బాల్స్ కి విరిగిన వికెట్

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ కోసం అన్ని జట్ల ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ముంబైలోని జట్టు క్యాంపులో చేరారు.

  • Written By:
  • Updated On - March 22, 2022 / 05:49 PM IST

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ కోసం అన్ని జట్ల ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ముంబైలోని జట్టు క్యాంపులో చేరారు. ఆరెంజ్ ఆర్మీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను పంచుకుంది. అందులో ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ అద్భుతమైన బంతితో స్టంప్‌ను విరగ్గొట్టడం హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. తమిళనాడుకు చెందిన నటరాజన్ గత కొన్నేళ్లుగా తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. నిలకడగా రాణించడంతో 2020-21 ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఇండియాకు ఎంపికైన నట్టూ అక్కడ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు.

అయితే నటరాజన్ 2021లో మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తర్వాత సర్జరీ చేయించుకుని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టెందుకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం నట్టు పూర్తి ఫిట్‌గా మారి తిరిగి ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు. మెగా వేలానికి ముందే విడుదలైన అతడిని హైదరాబాద్ 4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. 2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ పేసర్, ఇప్పటివరకు 24 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8.23 ​ఎకానమీ రేటుతో 20 వికెట్లు పడగొట్టాడు. సీజన్ ఆరంభానికి ముందే ప్రాక్టీస్ పదునైన పేస్ తో అదరగొడుతున్న నటరాజన్ ను చూసి సన్ రైజర్స్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ మార్చి 29న పుణెలో రాజస్థాన్ రాయల్స్‌తో తమ సీజన్ ను ప్రారంభించనుంది. గత సీజన్‌లో హైదరాబాద్‌ ప్రదర్శన నిరాశపరిచినా, ఈసారి మళ్లీ పుంజుకుని మైదానంలో సత్తా చాటాలని భావిస్తోంది.