Site icon HashtagU Telugu

Sky Record: సూర్య రికార్డుల మోత

Surya Kumar Yadav

Surya Kumar Yadav

టీ ట్వంటీ క్రికెట్ లో టీమిండియా యువ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ పరుగుల వరద కొనసాగుతోంది. తాజాగా సౌతాఫ్రికా సీరీస్ లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు.
రెండో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద సూర్యకుమార్‌ టీ20‍ల్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
573 బంతుల్లోనే సూర్య ఈ ఘనత సాధించాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్‌ నిలిచాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ పేరిట ఈ రికార్డు ఉండేది. మాక్స్‌వెల్ 604 బంతుల్లో 1000 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును సూర్య బ్రేక్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సూర్య తన హాఫ్‌ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే అందుకున్నాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు యువరాజ్‌ సింగ్‌ 2007 టీ20 ప్రపంచకప్‌లో 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మరోవైపు కెఎల్‌ రాహుల్‌ కూడా 2021లో స్కాట్‌లాండ్‌పై 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఫామ్ అభిమానులకు ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తోంది.