Ind Beat WI: సూర్యకుమార్ మెరుపులు…మూడో టీ ట్వంటీ భారత్ దే

టీ ట్వంటీ సీరీస్ లో భారత్ మళ్లీ పుంజుకుంది. మరోసారి సమిష్టిగా రాణించడంతో మూడో మ్యాచ్ లో గెలిచి సీరీస్ లో ఆధిక్యం అందుకుంది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ మెరుపులు...పంత్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాయి.

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 10:11 AM IST

టీ ట్వంటీ సీరీస్ లో భారత్ మళ్లీ పుంజుకుంది. మరోసారి సమిష్టిగా రాణించడంతో మూడో మ్యాచ్ లో గెలిచి సీరీస్ లో ఆధిక్యం అందుకుంది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ మెరుపులు…పంత్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేశాడు. నిజానికి విండీస్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ కైల్ మేయర్స్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అయితే మిగిలిన కరేబియన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు విండీస్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లతో ఆకట్టుకోగా.. హార్దిక్ పాండ్య, అర్ష దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. దీంతో విండీస్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో ఓవర్‌లో హిట్ మ్యాన్ అస్వస్థతకు గురవ్వడంతో అతడు మైదానాన్ని వీడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ సాయంతో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
తనతో ఓపెనింగ్ చేయించడమేంటన్న ప్రశ్నలపై సూర్యకుమార్‌ తనదైన రీతిలో జవాబిచ్చాడు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు.హోల్డర్ వేసిన 8వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ ఫోర్, సిక్సర్ సహా 15 పరుగులు రాబట్టాడు.మరోపక్క శ్రేయాస్ కూడా నిలకడగా ఆడుతూ.. సూర్యకుమార్‌కు చక్కగా సహకరించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 86 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే సూర్య అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 44 బంతుల్లో 76 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. సింగిల్స్‌తో స్ట్రైక్ రోటేట్ చేస్తూ ఆకట్టుకున్నాడు. దీపక్ హుడా తో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. పంత్ 26 బంతుల్లో 33 పరుగులు చేయగా…భారత్ 19 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఈ విజయంతో 5 టీ20లో సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యం సాధించింది.