‘Suryakumar Yadav: సూర్య‌కుమార్ మ‌రో ఏబీ డివిలియ‌ర్స్‌.. మాజీ క్రికెట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు..!

టీమిండియా ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే సూర్య‌కుమార్ ఆట‌తీరును, అద్భుత‌మైన ఫామ్‌ను సౌతాఫ్రికా మాజీ పేస‌ర్ డేల్ స్టెయిన్ ప్ర‌శంసించాడు.

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 06:01 PM IST

టీమిండియా ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే సూర్య‌కుమార్ ఆట‌తీరును, అద్భుత‌మైన ఫామ్‌ను సౌతాఫ్రికా మాజీ పేస‌ర్ డేల్ స్టెయిన్ ప్ర‌శంసించాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాల‌లోని పిచ్‌లు సూర్య‌కుమార్‌కు సరిగ్గా సరిపోతాయని అన్నాడు. అంతేకాకుండా సూర్యకుమార్ మ‌రో ఏబీ డివిలియ‌ర్స్ అని కొనియాడాడు.

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడని చెప్పడం అతిశయోక్తి కాదు. టీమిండియా బ్యాటింగ్ లో సూర్య‌కుమార్‌ సూపర్‌స్టార్‌గా అవతరించాడు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పెర్త్‌, మెల్‌బోర్న్‌ మైదానాల్లో సూర్య‌ రాణిస్తాడని చెప్పాడు. ‘‘బంతి పేస్‌ను చాలా చక్కగా అర్ధం చేసుకొని సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ చేయగలడు. లెగ్‌సైడ్‌ షాట్లను సింపుల్‌ గా కొట్టగలడు. నిల్చొని.. బ్యాక్‌ఫుట్‌ను ఉపయోగించి బౌండరీలు కొడ‌తాడు. కవర్‌డ్రైవ్‌లు అద్భుతంగా కొడ‌తాడు. ఆస్ట్రేలియా పిచ్‌ల‌పై బ్యాటర్లు ఎక్కువ‌ పరుగులు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది’’ అని స్టెయిన్ తెలిపాడు.

టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుండి సూర్యకుమార్ 176.81 స్ట్రైక్ రేట్‌తో 1045 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో నం.4 లేదా అంతకంటే తక్కువ బ్యాటింగ్‌లో మరే ఇతర బ్యాటర్ ఇలాంటి ఆటతీరును చూపలేదు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా జ‌ట్టులో 52 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు సూర్యకుమార్. రెండో వార్మప్ మ్యాచ్‌ను గురువారం మరోసారి టీమిండియా అదే జ‌ట్టుతో ఆడ‌నుంది.