MI vs SRH: వాంఖడేలో శతక్కొట్టిన సూర్యభాయ్‌.. సన్‌రైజర్స్‌పై రివేంజ్ తీర్చుకున్న ముంబై

ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో పాండ్యా , చావ్లా రాణిస్తే... బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.

MI vs SRH: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో పాండ్యా , చావ్లా రాణిస్తే… బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మరోసారి మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు హెడ్, అభిషేక్ శర్మ 56 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 11, మయాంక్ అగర్వాల్ నిరాశపరిచినా… హెడ్, నితీష్ రెడ్డి ఇన్నింగ్స్‌ కొనసాగించారు. నితీష్‌ 20 పరుగులకు ఔటవగా..క్లాసెన్ , షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ నిరాశపరచడంతో సన్‌రైజర్స్ వరుస వికెట్లు కోల్పోయింది. ఫామ్ కొనసాగించిన ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 48 పరుగులు చేసి ఔటవగా.. చివర్లో మార్కో జెన్సన్, కెప్టెన్ కమ్మిన్స్‌ ధాటిగా ఆడారు. ముఖ్యంగా కమ్మిన్స్ మెరుపులు మెరిపించాడు. 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్థిక్ పాండ్యా 3, చావ్లా 3 వికెట్లు పడగొట్టారు.

We’re now on WhatsAppClick to Join

ఛేజింగ్‌లో ముంబై ఇండియన్స్ తడబడింది. కేవలం 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఉషాన్ కిషన్ 9, రోహిత్ శర్మ 4 , నమన్ ధిర్ డకౌటయ్యారు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఈ సీజన్‌లో పెద్దగా రాణించని సూర్యకుమార్ ఎట్టకేలకు పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. అటు తిలక్ వర్మ కూడా తన ఫామ్ కొనసాగిస్తూ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ దూకుడుగా ఆడడంతో సాధించాల్సిన రన్‌రేట్ తగ్గిపోయి ముంబై ఒత్తిడి లేకుండా ఆడింది. చివర్లో విజయం కోసం 6 పరుగులే చేయాల్సి ఉండగా… సూర్యకుమార్ 96 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తిలక్ వర్మ సింగిల్ తీసి ఇవ్వడంతో తర్వాతి బంతినే సూర్య సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు విజయాన్ని కంప్లీట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై 17.2 ఓవర్లలో 174 పరుగుల టార్గెట్ అందుకుంది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది నాలుగో విజయం.

Also Read: Koppula: కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలులో ఎందుకు జాప్యం జరుగుతుంది- కొప్పుల