MI vs RCB: వాంఖడేలో సూర్యా భాయ్ విధ్వంసం… బెంగుళూరును చిత్తు చేసిన ముంబై

ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై మరోసారి భారీ టార్గెట్ ను అలవోకగా చేదించింది.

  • Written By:
  • Updated On - May 9, 2023 / 11:35 PM IST

MI vs RCB: ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై మరోసారి భారీ టార్గెట్ ను అలవోకగా చేదించింది. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించడంతో బెంగుళూరుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ లో డుప్లెసిస్, మాక్స్ వెల్ ఆటే హైలైట్. బెంగుళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే అనూజ్ రావత్ కూడా ఔటవ్వడంతో ఆర్‌సీబీ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో అదరగొట్టాడు. పవర్ ప్లేలో ఆర్‌సీబీ 2 వికెట్లకు 56 పరుగులు చేసింది. మాక్స్ వెల్ కు తోడు కెప్టెన్
డుప్లెసిస్ కూడా చెలరేగడంతో బెంగుళూరు స్కోర్ బోర్డు టాప్ గేర్ లో సాగింది. మ్యాక్స్‌వెల్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..డుప్లెసిస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది 6వ హాఫ్ సెంచరీ. మూడో వికెట్ కు మాక్స్ వెల్, డుప్లెసిస్ 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. డుప్లెసిస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65, మ్యాక్స్‌వెల్ 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 చేశారు.
చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ ధాటిగా ఆడారు. దీంతో బెంగుళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. చివర్లో దినేశ్ కార్తీక్ 18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30 రన్స్ చేశాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.

200 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి వికెట్ కు రోహిత్ శర్మతో కలిసి కేవలం 4.4 ఓవర్లలోనే 51 రన్స్ జోడించాడు. ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 42 రన్స్ చేశాడు. అయితే రోహిత్ , ఇషాన్ కిషన్ వెంట వెంటనే ఔట్ అవడంతో ముంబై కష్టాల్లో పడినట్టు కనిపించింది.
ఈ పరిస్థితుల్లో సూర్య కుమార్ యాదవ్, వధీర కీలక పార్టనర్ షిప్ తో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు.

బెంగుళూర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ మూడో వికెట్ కు కేవలం 10.4 ఓవర్లలోనే 140 పరుగులు జోడించారు. ముఖ్యంగా సూర్య కుమార్ తన ఫామ్ ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. సూర్య కుమార్ 35 బంతుల్లో 7 ఫోర్లు , 6 సిక్సర్లతో 83 రన్స్ కు ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ ఔట్ అయినా…అప్పటికే ముంబై విజయం ఖాయమయింది. మరోవైపు యువ బ్యాటర్ వదేరా 54 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. సూర్యా భాయ్ జోరుతో ముంబై 16.3 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.