Surya Kumar Yadav: నెంబర్ వన్ ర్యాంకుకు చేరువలో సూర్యకుమార్

ఐసీసీ టీ ట్వంటీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దుమ్మురేపాడు.

Published By: HashtagU Telugu Desk
Surya Imresizer

Surya Imresizer

ఐసీసీ టీ ట్వంటీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దుమ్మురేపాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ ట్వంటీలో మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరువయ్యాడు. ఈ మ్యాచ్ ప్రదర్శనతో మూడు స్థానాలు ఎగబాకి 816 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విండీస్‌ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌ 111 పరుగులు సాధించాడు.

ఓపెనర్‌గా ఈ సిరీస్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్ మొదట విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అతని కెరీర్ నాశనం చేస్తున్నారంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఫైరయ్యారు. అయితే మూడో టీ ట్వంటీలో సూర్యకుమార్ ఈ విమర్శలకు బ్రేక్ వేస్తూ చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అంత‍కుముందు ఇంగ్లండ్‌ సిరీస్‌లో కూడా రాణించిన సుర్యకుమార్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు వెస్టిండీస్‌ బ్యాటర్‌ బ్రాండన్‌ కింగ్‌ 27 ర్యాంక్‌కు చేరుకోగా, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో 31వ స్థానంలో నిలిచాడు. ఇక 818 పాయింట్లతో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా సూర్యకుమార్‌ మరో మూడు పాయింట్లు సాధిస్తే బాబర్‌ను అధిగమించి నెంబర్ వన్ ర్యాంకును అందుకునే అవకాశం ఉంది.

విండీస్‌తో ఫ్లోరిడా వేదికగా జరగనున్న మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ సూర్యకుమార్ తన ఫామ్ కొనసాగిస్తే అగ్రస్థానం చేజిక్కుంచుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

  Last Updated: 03 Aug 2022, 04:28 PM IST