Site icon HashtagU Telugu

Mumbai India Win: ముంబై గెలిచిందోచ్

mumbai indian

mumbai indian

ఐపీఎల్ 15వ సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. 8 వరుస పరాజయాల తర్వాత తొలి విజయాన్ని రుచి చూసింది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించిన ముంబై ఆటగాళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది. ఓపెనర్ పడిక్కల్ త్వరగానే ఔటైనా.. ఫామ్ లో ఉన్న జాస్ బట్లర్ దూకుడుగా ఆడాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటకీ..తర్వాత భారీ షాట్లతో అలరించాడు.
పిచ్ స్లోగా ఉండ‌టంతో ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిదానంగా ఆడిన బ‌ట్ల‌ర్.. హృతిక్ షోకీన్ వేసిన 16వ ఓవ‌ర్‌లో పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోయాడు. వ‌రుస‌గా 4 సిక్స‌ర్లు బాది స్కోర్ అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి సూర్య‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. బట్లర్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేసాడు. చివర్లో స్కోర్ వేగం పెంచే క్ర‌మంలో రాజ‌స్థాన్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. గ‌త మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో చెలరేగిన రియాన్ ప‌రాగ్ కూడా నిరాశపరిచాడు. ఆఖ‌రి ఓవ‌ర్లో ముంబై పేస‌ర్ మెరిడిత్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి అశ్విన్ (21) వికెట్ ప‌డ‌గొట్టాడు. ముంబై బౌల‌ర్ల‌లో మెరిడిత్, హృతిక్ షోకీన్ త‌లో 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా డేనియ‌ల్ సామ్స్‌, కుమార్ కార్తికేయ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు.

159 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబైకు మూడో ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (2) మళ్ళీ విఫ‌ల‌మ‌య్యాడు. ఇషాన్ కిషన్ 26 రన్స్ కు ఔటవగా… సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ముంబై ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ మూడో వికెట్ కు 81 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేయగా..తిలక్ వర్మ 35 రన్స్ చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. టిమ్ డేవిడ్ ముంబై విజయాన్ని పూర్తి చేశాడు. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.