SKY sparks:సూర్యకుమార్ మెరుపులు..జింబాబ్వే టార్గెట్ 187

సూపర్ 12 స్టేజ్‌ను గ్రూప్ టాపర్‌గా ముగించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జింబాబ్వేపై భారీస్కోర్ సాధించింది.

  • Written By:
  • Updated On - November 6, 2022 / 03:43 PM IST

సూపర్ 12 స్టేజ్‌ను గ్రూప్ టాపర్‌గా ముగించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జింబాబ్వేపై భారీస్కోర్ సాధించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీకి సూర్యకుమార్ యాదవ్ మెరుపులు తోడవడంతో 186 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ మరోసారి తక్కువ స్కోర్‌కే ఔటై నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కోహ్లీ ఇన్నింగ్స్ కొనసాగించారు. రాహుల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లీ 26 పరుగులకు ఔటైన తర్వాత రిషబ్ పంత్ కూడా వెనుదిరగడంతో స్కోర్ వేగంగా తగ్గింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్‌తో అమాంతం స్కోర్ పెంచేశాడు. విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అప్పటి వరకూ సింగిల్స్ తీసిన సూర్య ఒక్కసారిగా సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్య కుమార్ జోరుకు చివరి 5 ఓవర్లలో భారత్ 56 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఏకంగా 21 రన్స్ వచ్చాయి. మొత్తం మీద సూర్యకుమార్ మెరుపులు అభిమానులను అలరించాయి. స్కై కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.