Rishabh Pant: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) విడుదలయ్యాడు. దీంతో ఢిల్లీతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధానికి తెరపడింది. గాయం కారణంగా చాలా కాలం పాటు దూరంగా ఉన్న పంత్ గత సీజన్‌లో బలమైన పునరాగమనం చేశాడు. ఢిల్లీ నుంచి విడుదలయ్యాక ఇప్పుడు ఏ జట్టులోకి వస్తాడన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను ఇప్పుడు ఏ జట్టులో చేరవచ్చో సురేష్ రైనా జోస్యం చెప్పాడు.
తాజాగా జియోసినిమాలో మాట్లాడిన రైనా ఐపీఎల్ 2025 రిటైన్షన్ గడువుకు కొన్ని రోజుల ముందు ఢిల్లీలో MS ధోని, పంత్‌లను కలిసి చూశానని వెల్లడించాడు. రైనా ఈ ప్రకటనతో పంత్ CSKలో చేరడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడని రైనా పరోక్షంగా ఓ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో పంత్ చెన్నైలో చేరనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి చెన్నై.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మతిషా పతిరానా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలను రిటైన్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 55 కోట్ల విలువైన పర్స్, 1 RTM కార్డు మిగిలి ఉంది.
Also Read: Delhi Fire Dept: ఢిల్లీలో ఈసారి అత్యధిక ప్రమాదాలు.. 12 గంటల్లో 318 కాల్స్!
పంత్‌ను ఢిల్లీ ఎందుకు నిలబెట్టుకోలేదు?
పంత్‌కు భారీ డిమాండ్ ఉన్నందున అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ నుండి తప్పించారని మీడియా నివేదికలలో చెబుతున్నారు. పంత్ కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకున్నాడు. కోచింగ్ సిబ్బంది నియామకంలో కూడా తనకు చెప్పాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులు పంత్‌ను జట్టులో ఉండాలని కోరారు. కోచ్ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించడానికి ఇష్టపడలేదు. దాని కారణంగా వివాదం పెరిగింది. ఈసారి ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకుంది. అయితే త్వరలో జరగబోయే వేలంలో పంత్‌ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోనుందని తెలుస్తోంది. పంత్‌తో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నారు.