Site icon HashtagU Telugu

Suresh Raina Retires: క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై

Suresh Raina

Suresh Raina

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. సోషల్‌మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. భారత్‌కు,తన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. తన కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌, సీఎస్‌కే, ఇంకా అభిమానులకు ధన్యవాదాలంటూ రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.
మరో రెండు, మూడేళ్ల పాటు ఆడతానని ఇంతకుముందు ప్రకటించిన సురేశ్ రైనా.. తాజా నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కొంతమంది యువకులు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారనీ, ఇప్పటికే యూపీ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు తెలిపాడు.
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిస్టర్‌ ఐపీఎల్‌ మిగిలిపోయాడు.

సురేశ్ రైనా తన అంతర్జాతీయ కెరీర్‌లో 226 వన్డేలు, 18 టెస్టులు, 78 టీ ట్వంటీలకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 5615 పరుగులు చేయగా.. టీ ట్వంటీల్లో 1605 పరుగులు చేశాడు. టెస్టుల్లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా సురేశ్ రైనా రికార్డు సృష్టించాడు. అలాగే 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు. ఇందులో చెన్నై తరఫునే 4687 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.కాగా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ టోర్నీలో ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ నుంచి తప్పుకోవాలి. దీంతో సౌత్ ఆఫ్రికా , యూఏఈ టీ ట్వంటీ లీగ్ ల్లో రైనా ఆడే అవకాశం ఉంది.