Site icon HashtagU Telugu

Suresh Raina : రైనా ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టే

బెంగళూరు వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కొందరు స్టార్ ప్లేయర్స్ కు షాక్ ఇచ్చింది. వరల్డ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ అయినప్పటికీ ఐపీఎల్ లో మంచి రికార్డుల ఉన్నప్పటికీ ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్లలో ఒకడైన రైనా చివరకి వేలంలో అమ్ముడు కాకుండా మిగిలిపోయాడు.చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి వదిలేసిన తర్వాత కొనుగోలుచేసేవారే లేకుండా పోయారు. ఐపీఎల్ 2020 సీజన్ కి వ్యక్తిగత కారణాలతో దూరమైన రైనా.. 2021లో కనిపించాడు. ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికిన రైనా గత సీజన్లో పెద్దగా రానించలేదు. ఈ సారి కనీస ధర రూ. 2 కోట్లతో మెగా వేలానికి వచ్చాడు.. కానీ రైనాని కొనుగోలు చేసేందుకు ఒక్క జట్టు కూడా ముందుకు రాలేదు.. దీంతో రైనా అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు.

రైనా పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్ర‌స్తుతం సురేష్ రైనా ఫాంలో లేడు. దీనికి తోడు ఇటీవ‌ల ఎలాంటి క్రికెట్ ఆడ‌లేదు. దీంతో ఈ సీజ‌న్లో అతను రాణిస్తాడ‌ని ఫ్రాంచైజీలు నమ్మలేదని తెలుస్తోంది. అటు 2020లో యూఏఈ వేదికగా లీగ్ జ‌రిగిన‌ప్పుడు రైనా మ్యాచ్‌లు మొద‌ల‌వ‌కుండానే స్వ‌దేశానికి తిరిగొచ్చేయడం కూడా ప్రభావం చూపినట్టు సమాచారం. ఐపీఎల్‌లో ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే ఆడతానని, మరో ఫ్రాంఛైజీకి ఆడబోనని గతంలో సురేష్ రైనా కామెంట్ చేశాడు. ఈ కారణాలతోనే మిగిలిన ఫ్రాంఛైజీలు రైనాని కొనడానికి ఆసక్తి చూపించలేదని కొందరు భావిస్తున్నారు.

ఐపీఎల్ కెరీర్‌లో 5500 పైగా పరుగులు చేసిన సురేష్ రైనా, టీమిండియా కంటే చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే అద్భుతంగా రాణించి మిస్టర్ ఐపీఎల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్నింటికీ మించి చెన్నై కెప్టెన్ ధోనీతో మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా అయినా రైనాను చెన్నై తీసుకుంటుందని భావించారు. చెన్నై కూడా అతన్ని తీసుకోకపోవడంతో రైనా ఫాన్స్ నిరాశకు గురయ్యారు. లీగ్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన వారిలో 5వేల 528పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా స‌గటు 32. రైనా ఐపీఎల్ కెరీర్ లో 39 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ కూడా ఉన్నాయి. వేలంలో అమ్ముడు కాక పోవడంతో రైనా ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టేనని చెప్పొచ్చు.