Site icon HashtagU Telugu

డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ అదుర్స్… భారీ టార్గెట్ ను ఛేదించిన హైదరాబాద్

SRH vs RR

Srh Vs Rr

SRH vs RR: ఇది కదా మ్యాచ్ అంటే… అసలు గెలుపు ఆశలు లేని స్థితి నుంచి విజయాన్ని అందుకుంటే ఆ మజానే వేరు. ఇలాంటి విజయాన్నే ఆస్వాదిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. చివరి ఓవర్ లో సందీప్ శర్మ వేసిన నోబాల్ మ్యాచ్ ను మలుపుతిప్పి సన్ రైజర్స్ ను గెలిపించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ తొలి వికెట్ కు 54 పరుగులు జోడించారు. జైశ్వాల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 రన్స్ కు ఔటయ్యాడు. అయితే బట్లర్ మాత్రం మరింతగా చెలరేగిపోయాడు. కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. బట్లర్, శాంసన్ చెరొక ఎండ్ నుంచీ రెచ్చిపోవడంతో రాజస్థాన్ స్కోర్ టాప్ గేర్ లో సాగింది.

వీరిద్దరూ రెండో వికెట్ కు 138 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. బట్లర్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేసి 5 రన్స్ తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. అటు కెప్టెన్ శాంసన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ , జెన్సన్, మర్క్ రమ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

భారీ లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్ మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 51 పరుగులు జోడించారు. అన్ మోల్ 33 రన్స్ కు ఔటైనప్పటకీ.. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ దూకుడు కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 65 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులకు వెనుదిరిగాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన క్లాసెన్ కూడా మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేశాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో రాజస్థాన్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. తన స్పిన్ మ్యాజిక్ తో వరుస వికెట్లు పడగొట్టాడు. కీలకమైన త్రిపాఠీ , క్లాసెన్ , మక్ర్ రమ్ లను ఔట్ చేశాడు. చివరి 2 ఓవర్లలో విజయం కోసం 41 పరుగులు చేయాల్సి ఉండగా..
గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించాడు. 19వ ఓవర్ లో వరుసగా మూడు సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. అయితే అదే ఓవర్ ఐదో బాల్ కు ఔటవడంతో సన్ రైజర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ఫిలిప్స్ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో గెలుపు కోసం 17 పరుగులు చేయాల్సి ఉండగా.. అబ్దుల్ సమద్ అదరగొట్టాడు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన దశలో సందీప్ శర్మ నోబాల్ వేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఫ్రీ హిట్ ను సమద్ సిక్సర్ గా మలచడంతో సన్ రైజర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది నాలుగో విజయం.

Also Read: GT vs LSG Highlights: హోంగ్రౌండ్‌లో దుమ్మురేపిన గుజరాత్‌.. లక్నోపై ఘనవిజయం