Sunrisers Hyderabad: విజయంతో ముగించేది ఎవరో ?

ఐపీఎల్ 15వ వ సీజన్‌ లో భాగంగా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఈరోజు సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు పోటీపడనున్నాయి.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 02:39 PM IST

ఐపీఎల్ 15వ వ సీజన్‌ లో భాగంగా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఈరోజు సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు పోటీపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా కూడా ప్లే ఆఫ్స్‌ చేరేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇక టోర్నీలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో తుది జట్లలో భారీ మార్పులు చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తంగరాజు నటరాజన్‌, ఐడెం మార్క్రమ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు విశ్రాంతినిచ్చి అబ్దుల్‌ సమద్‌, రొమారియో షెపర్డ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, కార్తీక్‌ త్యాగిలకు తుదిజట్టులో అవకాశం కల్పించనుంది. అలాగే పంజాబ్‌ కింగ్స్ కూడా తమ తుదిజట్టులో హర్ప్రీత్‌ బ్రార్‌, రిషి ధవన్‌, భానుక రాజపక్సలకు రెస్ట్ ఇచ్చి బెన్నీ హోవెల్‌, ఇషాన్‌ పోరెల్‌, వైభవ్‌ అరోరా తుది జట్టులో ఆడించనుంది…

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో పోటీపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమవడంతో అతని స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.
ఇక మరోవైపు వాంఖడే వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 5 వికెట్ల తేడాతో ముంబయిజట్టు ఓడించేయడంతో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. ఇక మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌-రాజస్థాన్‌ జట్లు పోటీపడనుండగా, మే 25న జరిగే ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ,ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 29న ఫైనల్‌మ్యాచ్‌ జరుగనుంది.