Rahul Captaincy : రాహుల్ ఇదేం కెప్టెన్సీ..మాజీల ఫైర్

భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు వైట్ వాష్ చేసింది.

  • Written By:
  • Publish Date - January 24, 2022 / 11:54 AM IST

భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు వైట్ వాష్ చేసింది. టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న టీమిండియా వన్డే సిరీస్ లో అన్ని మ్యాచ్ లూ ఓడిపోవడం అభిమానులకు, మాజీ క్రికెటర్లకు మింగుడుపడడం లేదు. పేలవమైన బ్యాటింగ్, పసలేని బౌలింగ్ తో పాటు కెఎల్ రాహుల్ కెప్టెన్సీ లోపాలు కారణాలుగా చెబుతున్నారు. టీమిండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన కెఎల్ రాహుల్‌.. సారథిగానే కాకుండా బ్యాట‌ర్‌గా కూడా తేలిపోయాడు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కి ఇదే మొదటి సిరీస్‌కాగా.. భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్సీ వహించిన తొలి మూడు వన్డేల్లోనూ ఓటమి పాలైన మొదటి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ చెత్త రికార్డ్‌ ఖాతాలో వేసుకున్నాడు…

ఈ క్ర‌మంలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. మైదానంలో పరిస్థితులకు తగినట్లు వ్యూహాల‌ను ర‌చించ‌డంలో కెఎల్ రాహుల్ పూర్తిగా విఫ‌ల‌మయ్యాడ‌ని గవాస్కర్ అన్నాడు. ఇలాంటి కెప్టెన్ ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రికెట్ కు అవసరం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లోనూ రాహుల్ విఫలమవడంంతో మాజీ ఆటగాళ్ళతో పాట, అభిమానులు రాహుల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు,. నిజానికి ఈ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మ సారథిగా వ్యవహరించాల్సి ఉంది. ఈ టూర్ కు ముందు రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ .. రోహిత్ శర్మకి సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈ పర్యటన ముందు ఫిట్‌నెస్ లేమితో రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు రాహుల్ అందుకోక తప్పలేదు. అయితే వ్యూహాత్మకంగా జట్టును లీడ్ చేయడంలో అతను విఫలమయ్యాడని మాజీ ఆటగాల్ళు అభిమానులు మండిపడుతున్నారు.