Ashes Series : అప్పుడు మీరేం చేసిందేంటి ?… అలాంటి గెలుపు మాకొద్దు

యాషెస్ సిరీస్ (Ashes Series) రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

  • Written By:
  • Updated On - July 3, 2023 / 01:33 PM IST

Ashes Series : యాషెస్ సిరీస్ (Ashes Series) రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్ లో బెయిర్ స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం అది ఔటేనని కొందరు.. క్రీడాస్ఫూర్తి ప్రకారం నాటౌట్ అని కొందరు దీనిపై వాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాలు దీనిపై రెండుగా చీలిపోయాయి. అటు ఇరు జట్ల కెప్టెన్లు కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇది ఔటేనని ఆసీస్ సారథి మిఛెల్ స్టార్క్ చెబుతుంటే… ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మాత్రం తొండాట అంటూ చురకలంటించాడు.

కామెరూన్ గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. ఓవర్ పూర్తయిందనే ఆలోచనతో నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్‌ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు. బంతి కీపర్ చేతుల్లో ఉండగానే జానీ బెయిర్ స్టో క్రీజును ధాటడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దీనిపై ఇంగ్లాండ్ అభిమానులు ఆసీస్ జట్టును స్టేడియంలో గేలి చేశారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ సారథి స్టోక్స్ కూడా దీనిపై స్పందించాడు. ఇలాంటి ఔట్ తో వచ్చే గెలుపు గెలుపు కాదంటూ వ్యాఖ్యానించాడు. తనకే ఇలాంటి పరిస్థితి వస్తే అప్పీల్‌ను వెనక్కు తీసుకునేవాడినని, ఇలా గెలవడం కంటే ఓడిపోవడం ఉత్తమమని కామెంట్ చేశాడు.

అటు స్టోక్స్ కామెంట్స్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ మిఛెల్ స్టార్క్ కూడా కౌంటరిచ్చాడు. 2019లో ఇదే పద్దతిలో స్టీవ్ స్మిత్‌ను జానీ బెయిర్ స్టో ఔట్ చేశాడని గుర్తు చేశాడు. ఇలా ఔట్ చేయొచ్చని నిబంధనల్లో ఉందని, కొందరికి ఇది నచ్చడం లేదని స్టార్క్ వ్యాఖ్యానించాడు. బెయిర్ స్టోను అప్పటికప్పుడు అలా స్టంపౌట్ చేయలేదనీ, అతను కీపర్ చేతుల్లోకి బంతి రాకముందే క్రీజును వీడుతున్నాడనే విషయాన్ని అలెక్స్ క్యారీ గుర్తించి ఔట్ చేశాడని స్టార్క్ సమర్థించుకున్నాడు. గతంలో చాలాసార్లు బెయిర్ స్టో అలానే చేశాడన్నాడు. ఈ మ్యాచ్‌ తొలి రోజు డేవిడ్ వార్నర్‌ను ఇలానే ఔట్ చేసేందుకు ప్రయత్నించాడనీ, 2019లో స్టీవ్ స్మిత్‌ను ఇలానే ఔట్ చేశాడన్నాడు. స్టార్క్ వాదన ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం బెయిర్ స్టో స్టంపౌట్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. క్రీడాస్ఫూర్తి అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Also Read:  Opposition Meet Postponed : విపక్షాల మీటింగ్ వాయిదా.. పార్లమెంటు సమావేశాల తర్వాతే భేటీ