Sri Lanka: ఆస్ట్రేలియా క్రికెటర్ల మనసు దోచిన లంక ఫ్యాన్స్

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా జట్టుకు చివరి మ్యాచ్‌లో ఊహించని ఫేర్‌వెల్ దక్కింది.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 05:45 PM IST

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా జట్టుకు చివరి మ్యాచ్‌లో ఊహించని ఫేర్‌వెల్ దక్కింది. ప్రేమదాస స్టేడియానికి భారీగా చేరుకున్న అభిమానులు థాంక్యూ ఆస్ట్రేలియా.. థాంక్యూ ఆస్ట్రేలియా..అనే నినాదాలతో హోరెత్తించారు. ఒకమాటలో చెప్పాలంటే కంగారూలు తమ సొంతగడ్డపై ఆడుతున్న హంగామా కనిపించింది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు ఆసీస్‌ క్రికెట్‌ ఆడేందుకు రావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. ఆసీస్‌ జట్టు రావడంతో లంక బోర్డుకు కాస్త ఆదాయాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పొచ్చు. పైగా రెండు సిరీస్‌లూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి అభిమానులను అలరించాయి. దీంతో సిరీస్ ఫలితం తేలిపోయినా చివరి మ్యాచ్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.

కష్టాల్లో ఉన్న తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకు లంక అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. చివరి వన్డే సందర్భంగా హాజరైన ప్రేక్షకులు లంక పర్యటనకు వచ్చినందుకు థాంక్యూ ఆస్ట్రేలియా అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. లంక అభిమానులు తమ చర్యతో అందరి హృదయాలను దోచుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లంతా గ్రౌండ్ లోపల తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. లంకేయుల అభిమానానికి కంగారూలు ఫిదా అయ్యారు. ఇదే విషయమై ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం ముగ్దుడైపోయాడు. అభిమానుల మద్దతు చూస్తుంటే చాలా గొప్పగా ఉందన్నాడు. ఇతర దేశంలో ఉండి కూడా అభిమానులు తమకు ఇంత మద్దతునివ్వడం మరిచిపోలేనిదని చెప్పాడు. ఇక క మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 43.1 ఓవర్లలో 160 పరుగులు చేయగా.. కరుణరత్నే 75 పరుగులతో రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా కూడా తడబడినా 39 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లంక టూర్‌లో ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్‌ను గెలుచుకోగా… వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది.