Asia Cup 2024: మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ కు షాక్ తగిలింది. ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. ఆతిథ్య శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. షెఫాలీ త్వరగానే ఔటైనా మంధాన దూకుడుగా ఆడింది. ఉమా చెత్రి, హర్మన్ ప్రీత్ కౌర్ నిరాశపరిచారు. అయితే స్మృతి, రోడ్రిగ్స్ ధాటిగా ఆడడంతో భారీస్కోర్ సాధించేలా కనిపించింది. మంధాన 47 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు చేసి ఔటవగా… రోడ్రిగ్స్ 29 రన్స్ చేసింది. చివర్లో రిఛా ఘోష్ 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 30 పరుగులు చేయడంతో స్కోర్ 160 దాటింది. లంక బౌలర్లు మిడిల్ ఓవర్స్ లో భారత్ ను కట్టడి చేయడం వారికి కలిసొచ్చింది.(Asia Cup 2024)
ఫైనల్లో 166 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉన్నప్పటకీ శ్రీలంక మహిళల జట్టు ఎటాకింగ్ బ్యాటింగ్ తో పై చేయి సాధించింది. ఓపెనర్ గుణరత్నే రెండో ఓవర్లోనే ఔటైనప్పటకీ.. కెప్టెన్ చమరి ఆతపత్తు, హర్షిత మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ రెండో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో ఆతపత్తు 43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులకు ఔటవగా.. మ్యాచ్ అప్పటికే భారత్ చేజారింది. ఫీల్డింగ్ లో పలు తప్పిదాలు కూడా భారత్ కొంపముంచాయి. హర్షిత , కవిశ దూకుడుగా ఆడడంతో శ్రీలంక మరో 8 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. హర్షిత 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 , కవిశ 16 బంతుల్లోనే 30 పరుగులు చేశారు. టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత బౌలర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్ ఫైనల్లో నిరాశపరిచారు. కాగా ఆసియాకప్ గెలవడం శ్రీలంకకు ఇదే తొలిసారి.
Also Read: Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు