Sri Lanka vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. శ్రీలంకతో జరిగిన 2 వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా (Sri Lanka vs Australia) కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక 174 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆసియా జట్టు చేతిలో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద ఓటమి. 43 ఏళ్ల తర్వాత కంగారూ జట్టును శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు 1982లో ఆస్ట్రేలియాను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది.
కొలంబో వేదికగా ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య రెండు వన్డేల సిరీస్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ శ్రీలంక 174 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి శ్రీలంక వన్డే సిరీస్‌ని 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో వన్డేల్లో ఆస్ట్రేలియాపై శ్రీలంకకు ఇదే అతిపెద్ద విజయం.
Also Read: Spinner Sports Drinks: స్పోర్ట్స్ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్.. 10 రూపాయలకే డ్రింక్!
282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టర్నింగ్ ట్రాక్‌లో ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్ ప్రేమదాస స్టేడియంలో బౌలింగ్ త్రయం అసిత ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, వనిందు హసరంగా అద్భుత ప్రదర్శన చేశారు. ఆస్ట్రేలియా జట్టు మొత్తం 107 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ స్టీవ్ స్మిత్ అత్యధిక పరుగులు చేశాడు. 34 బంతుల్లో 29 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక తరఫున దునిత్ వెల్లలాగే 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అసిత ఫెర్నాండో, హసరంగ చెరో మూడు వికెట్లు తీశారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలింది
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ విఫలమైంది. తొలి వన్డేలో 215 పరుగులను చేధించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 165 పరుగులకే ఆలౌటైంది. రెండో వన్డేలో పటిష్ట బ్యాటింగ్ ఆర్డర్ కూడా శ్రీలంక బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి 7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది. ఇందులో మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్ వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ వెంటనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్- జోష్ ఇంగ్లిస్ మధ్య 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇంగ్లిష్ ఔట్ అయిన వెంటనే ఆస్ట్రేలియా జట్టు పేకమేడలా కుప్పకూలింది. దీంతో ఆసీస్ జట్టు కేవలం 107 పరుగులకు కుప్పకూలింది. దీంతో శ్రీలంక జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.