World Cup 2023: మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. సీనియర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ నిరాశపరిచినా మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లీష్ కలిసి ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించారు..ఇన్నింగ్స్ లో బౌలర్లు సైతం చెలరేగిపోయారు. భారీ స్కోరు చేసేలా కనిపించిన లంకను అరికట్టడంలో ఆసీస్ బౌలర్లు విజయం సాధించారు. దీంతో శ్రీలంక స్వల్ప స్కోరుకి చాప చుట్టేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిజానికి శ్రీలంక ఆరంభం నుంచి ధాటిగా ఆడటంతో 300 స్కోర్ ఈజీగా సాదిస్తుందనుకున్నారు. వికెట్ కోల్పోకుండా 100కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు నిస్సంకా, కుసల్ పెరెరా హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేశారు. దీంతో ఆసీస్ కు మరో ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు.. లంక బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్‌కు పంపుతూ.. 209 పరుగులకు వారిని ఆలౌట్ చేశారు. సరిగ్గా 125 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక.. మరో 84 పరుగులు మాత్రమే చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ లో నిస్సంకా 61, పెరెరా 78 తప్ప మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. మిచెల్ స్టార్క్ 2, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేయగా, జోష్ ఇంగ్లిస్ 59 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 58 పరుగులు చేశాడు. మార్నస్ లబూషేన్ 60 బంతుల్లో 2 బౌండరీలు కొట్టి 40 పరుగులు రాబట్టాడు.ఆఖర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 21 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ ద్వారా హ్యాట్రిక్ అపజయాలతో శ్రీలంక అట్టడుగున చేరింది.125 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని శ్రీలంక 209 పరుగులకు ఆలౌట్ అవ్వడం క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురిచేసింది.
Also Read: Sky Fruit : గుండెపోటు రిస్క్ ను తగ్గించే ‘స్కై ఫ్రూట్’.. తెలుసా ?