Sanath Jayasuriya : సనత్ జయసూర్య.. ఒకప్పుడు శ్రీలంక క్రికెట్‌లో స్టార్ బ్యాట్స్‌మన్. ఆయన తన డ్యాషింగ్ బ్యాటింగ్‌తో మైదానంలో పరుగుల వరదను పారించేవారు. లంక టీమ్ కెప్టెన్‌గానూ ఆయన చక్కటి సేవలు అందించారు. ఈనేపథ్యంలో జయసూర్యకు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. శ్రీలంక క్రికెట్ టీమ్‌కు ఒక సంవత్సరం పాటు ఫుల్ టైమ్ కన్సల్టెంట్‌గా జయసూర్యను నియమించింది. కొత్త లీడ్ సెలెక్టర్, మాజీ ఓపెనర్ ఉపుల్ తరంగ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ ఈమేరకు నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు జాతీయ కార్యక్రమాలు, క్రీడాకారుల ఆటతీరును మెరుగుపర్చడం, కోచింగ్ సిబ్బందిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను జయసూర్య నిర్వర్తిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
జయసూర్య(Sanath Jayasuriya) తన కొత్త బాధ్యతలను వెంటనే స్వీకరించారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఉన్న హై పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి ఆయన పని చేస్తారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లలో లంక కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో మొత్తం 10 జట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఫలితంగా శ్రీలంక ప్రభుత్వం తమ క్రికెట్ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తోంది.
Also Read: Chrome – Warning : గూగుల్ క్రోమ్ యూజర్స్‌కు ప్రభుత్వం వార్నింగ్
ఇక బుధవారం రోజే శ్రీలంక క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉపుల్ తరంగ ఎంపికయ్యారు. ఈ కమిటీ ఇతర సభ్యులలో మాజీ క్రికెటర్లు అజంతా మెండిస్, ఇండికా డి శ్రామ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా కూడా ఉన్నారు. శ్రీలంక క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఈ కసరత్తు జరుగుతోంది.
