Asia Cup Finals: ఆసియా రారాజు ఎవరో ?

ఆసియాకప్ ఫైనల్ కు అంతా సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమిండియా సూపర్ 4లో ఇంటిదారి పడితే అండర్ డాగ్ గా భావించిన శ్రీలంక ఫైనల్ కు దూసుకెళ్లింది.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 01:44 PM IST

ఆసియాకప్ ఫైనల్ కు అంతా సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమిండియా సూపర్ 4లో ఇంటిదారి పడితే అండర్ డాగ్ గా భావించిన శ్రీలంక ఫైనల్ కు దూసుకెళ్లింది. పాకిస్థాన్ తో టైటిల్ పోరులో తలపడబోతోన్న లంకనే ఫేవరెట్ గా చెప్పొచ్చు.

ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై శ్రీలంక ఓడిపోయినప్పుడు ఎవ్వరూ ఆ జట్టును ఫైనల్ కు చేరుతుందని అనుకోలేదు. వారి స్వదేశంలో పరిస్థితులు, జట్టులో స్టార్ ప్లేయర్స్ ఎవరూ లేకపోవడం వంటి కారణాలతో తేలిగ్గానే తీసుకున్నారు. అయితే షార్ట్ ఫార్మేట్ లో నిలకడగా రాణిస్తూ వరుస విజయాలతో లంక సత్తా చాటింది. అంచనాలు లేకుండానే భారత్, పాకిస్థాన్ లను ఓడించింది. బ్యాటింగ్ లో ప్రతీ ఒక్కరూ ఎన్నో కొన్ని పరుగులు.. అది కూడా ధాటిగా ఆడుతూ స్కోర్ అందిస్తుండడం లంకకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

ప్రతీ మ్యాచ్ లో ఏ ఒక్కరి పైనే ఆ జట్టు ఆధారపడకుండా ఫైనల్ కు చేరింది. తొలి మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓడినప్పటకీ.. తర్వాత వరుసగా బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, భారత్, పాకిస్థాన్ పై విజయాలు సాధించింది. పాక్ తో నామమాత్రంగా జరిగిన చివరి మ్యాచ్ లోనూ లంక రాణించింది. బ్యాటింగ్ లో నిసాంక, శనక రాణిస్తుండగా.. బౌలింగ్ లో హసరంగ , తీక్షణ కీలకంగా చెప్పొచ్చు.
మరోవైపు తొలి మ్యాచ్ లో భారత్ పై చిత్తుగా ఓడిన పాకిస్థాన్ తర్వాత వరుస విజయాలతో సత్తా చాటింది. సూపర్ 4 స్టేజ్ లో భారత్ పై ప్రతీకారం తీర్చుకుని, హాంకాంగ్, ఆప్ఘనిస్థాన్ లపై విజయాలను అందుకుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ జట్టుపైనా తక్కువ స్కోరును ఛేదించేందుకు చివరి ఓవర్ వరకూ 9 వికెట్లు కోల్పోయి పోరాడి గెలిచింది. అలాగే నామమాత్రపు పోరులో శ్రీలంకపైనా చేతులెత్తేసింది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని జట్టుగా తనపై ఉన్న ముద్రను కొనసాగిస్తోంది. కెప్టెన్ బాబర్ అజాం ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు ప్రధాన ఇబ్బందిగా మారింది.

బ్యాటింగ్ లో రిజ్వాన్, అసిఫ్ అలీపైనా ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది లేకపోవడం కూడా పాక్ కు మైనస్ పాయింట్. అయితే మిగిలిన బౌలర్లలో రవూఫ్ రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ కంటే ఈ ఫైనల్ పోరులో శ్రీలంకనే ఫేవరెట్ గా చెబుతున్నారు. టోర్నీ ఆద్యంతం పాక్ తో పోలిస్తే నిలకడగా రాణిస్తున్న లంకకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. గత రికార్డుల పరంగా లంకపై పాక్ దే పైచేయిగా ఉంది.ఇక మ్యాచ్ కు ఆతిథ్య మిస్తున్న దుబాయ్ పిచ్ ఛేజింగ్ చేసే జట్టుకే గెలిచే అవకాశముందని అంచనా.