SRH vs MI: సొంతగడ్డపై సన్‌రైజర్స్ బోణీ కొడుతుందా.. ముంబైతో మ్యాచ్‌కు హైదరాబాద్ రెడీ

భారీ అంచనాలతో బరిలోకి దిగి ఓటమితో సీజన్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రెండో మ్యాచ్‌కు రెడీ అయింది. హోంగ్రౌండ్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. గత సీజన్‌తో పోలిస్తే జట్టులో పలు మార్పులు జరిగినా తొలి మ్యాచ్‌లో అందరూ అంచనాలు అందుకోలేకపోయారు

SRH vs MI: భారీ అంచనాలతో బరిలోకి దిగి ఓటమితో సీజన్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రెండో మ్యాచ్‌కు రెడీ అయింది. హోంగ్రౌండ్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. గత సీజన్‌తో పోలిస్తే జట్టులో పలు మార్పులు జరిగినా తొలి మ్యాచ్‌లో అందరూ అంచనాలు అందుకోలేకపోయారు. ఐపీఎల్‌లో చాలా సీజన్లు పటిష్టమైన బౌలింగ్‌తో విజయాలు సాధించిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఈసారి కూడా బలంగానే ఉన్నా కోల్‌కతాతో మ్యాచ్‌లో తేలిపోయింది. ఏకంగా 20.5 కోట్లు పెట్టి కొన్న ప్యాట్ కమ్మిన్స్ 1 వికెట్ మాత్రమే పడగొట్టగా…భువనేశ్వర్, మార్కో జెన్సన్ తేలిపోయారు. నటరాజన్, మార్కండే మాత్రమే ఆకట్టుకుకోగా.. మిగిలిన బౌలర్లు గాడిన పడాల్సి ఉంది. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై అంచనాలుండగా… రాహుల్ త్రిపాఠీ ధాటిగా ఆడాల్సిన పరిస్థితి ఉంది. అయితే వికెట్ కీపర్ క్లాసెన్ సూపర్ ఫామ్ సన్‌రైజర్స్‌కు పెద్ద అడ్వాంటేజ్. కోల్‌కతాతో మ్యాచ్‌లో క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 8 సిక్సర్లతో 69 రన్స్‌తో అదరగొట్టాడు. గత సీజన్‌లోనూ పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన క్లాసెన్‌ ముంబైతో మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు.

మరోవైపు ఎప్పటిలానే సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్‌ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో ముంబై కూడా గెలుపు ముంగిట బోల్తా పడింది. ట్రేడింగ్‌లో భారీ మొత్తం వెచ్చించి తెచ్చుకున్న హార్థిక్ పాండ్యా కెప్టెన్‌గా ప్రభావం చూపలేకపోయాడు. దీనికి తోడు బౌలర్లను సరిగా వాడుకోలేదని, బ్యాటింగ్‌లో తాను ఏడో స్థానంలోనూ రావడంపైనా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీనికి తోడు రోహిత్‌శర్మతో పొసగడం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాండ్యా జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి. బ్యాటింగ్‌లో పలువురు స్టార్ ఆటగాళ్ళు ఉండడం, బౌలింగ్‌ పరంగానూ పటిష్టంగా ఉండడం ముంబైకి అడ్వాంటేజ్. అయితే గత మ్యాచ్‌లో బూమ్రా, కొయెట్జీ మాత్రం సత్తా చాటారు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ బూమ్రా కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే సఫారీ పేసర్ కొయెడ్జీ కూడా 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే పియూష్ చావ్లా, పాండ్యా కూడా గాడిన పడాల్సి ఉంది.

ఓవరాల్ రికార్డులను చూస్తే సన్‌రైజర్స్‌పై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 21 సార్లు తలపడగా..ముంబై 12 మ్యాచ్‌లలో గెలిస్తే సన్‌రైజర్స్ తొమ్మిందింటిలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలిస్తుందని అంచనాలున్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు. మొత్తం మీద సన్‌రైజర్స్‌,ముంబై మధ్య జరిగే పోరు అభిమానులకు పరుగుల పండుగే కానుంది,

Also Read: YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి