SRH Vs KKR: ఈడెన్ లో సన్ “రైజింగ్”.. హైదరాబాద్ కు రెండో విజయం

ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిన పడినట్టే కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నిరాశపరిచిన హైదరాబాద్ తర్వాత మూడో మ్యాచ్ లో పంజాబ్ గెలిచి సీజన్ లో ఖాతా తెరిచింది.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 11:18 PM IST

SRH Vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిన పడినట్టే కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నిరాశపరిచిన హైదరాబాద్ తర్వాత మూడో మ్యాచ్ లో పంజాబ్ గెలిచి సీజన్ లో ఖాతా తెరిచింది. అదే జోరును కొనసాగిస్తూ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఈడెన్ గార్డెన్స్ లో నిలువరించింది. హై స్కోరింగ్ ఎన్ కౌంటర్ లో సన్ రైజర్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో హ్యారీ బ్రూక్ బ్యాటింగే హైలెట్. గత మూడు మ్యాచ్ లలో విఫలమైన బ్రూక్ ఈడెన్ లో మాత్రం రెచ్చిపోయాడు. ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు. మయాంక్ అగర్వాల్ 9 , రాహుల్ త్రిపాఠీ 9 రన్స్ కే ఔటైనప్పటకీ.. బ్రూక్ , కెప్టెన్ మర్క్ రమ్ మాత్రం దంచికొట్టారు. బ్రూక్ ఒకవైపు , మర్క్ రమ్ మరోవైపు భారీ షాట్లతో కోల్ కతా బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన మర్క్ రమ్ 26 బంతుల్లోనే 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. తర్వాత అభిషేక్ శర్మ కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 రన్స్ చేశాడు. చివర్లో బ్రూక్ కూడా ధాటిగా ఆడి సెంచరీ సాధించాడు. బ్రూక్ 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా సన్ రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 , వరుణ్ చక్రవర్తి 1 వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.మూడో బంతికే గుర్బాజ్ ఔటవగా.. తర్వాత వెంకటేశ్ అయ్యర్ , సునీల్ నరైన్ ఔటయ్యారు. అయితే జగదీశన్ , కెప్టెన్ నితీశ్ రాణా ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆరో ఓవర్ లో నితీశ్ రాణా చుక్కలు చూపించాడు. ఏకంగా 28 రన్స్ కొట్టాడు. జగదీశన్
36 రన్స్ కు ఔటైన తర్వాత కోల్ కతా మళ్ళీ వికెట్లు కోల్పోయింది. రస్సెల్ కూడా 3 రన్స్ కే ఔటవడంతో ఓటమి ఖాయమైనట్టే కనిపించింది. అయితే నితీశ్ రాణా మెరుపులు కొనసాగించాడు. భారీ షాట్లతో మ్యాచ్ ను రసవత్తరంగా మార్చాడు. అటు గుజరాత్ మ్యాచ్ లో హీరో రింకూ సింగ్ కూడా ధాటిగా ఆడడంతో కోల్ కతా విజయంపై ఆశలు నిలిచాయి. నితీశ్ రాణా 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులకు ఔటవడంతో కోల్ కతా ఆరో వికెట్ కోల్పోయింది.

అప్పటికి విజయం కోసం ఇంకా 21 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉంది. రింకూ సంగ్ ధాటిగా ఆడుతూ సన్ రైజర్స్ ను టెస్షన్ పెట్టాడు. తన ఫామ్ కొనసాగిస్తూ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చివరి ఓవర్లో శార్థూల్ ఠాకూర్ తొలి బంతికే ఔటవడంతో సమీకరణం అసాధ్యంగా మారిపోయింది. ఈ ఓవర్ ను ఉమ్రాన్ మాలిక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్ కతా పరుగులే చేయగలిగింది. రింకూ సింగ్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అతనికి మరో బ్యాటర్ నుంచి సపోర్ట్ ఉండుంటే కోల్ కతా ఈ టార్గెట్ ను ఛేదించి ఉండేది. మొత్తం మీద కోల్ కతాపై గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో జెన్సన్ 2 , మయాంక్ మర్కండే 2 వికెట్లు పడగొట్టారు.