Site icon HashtagU Telugu

Brian Lara: బ్రయాన్ లారా ఔట్.. కొత్త కోచ్ వేటలో సన్ రైజర్స్..!

Brian Lara

Resizeimagesize (1280 X 720) 11zon

Brian Lara: ఐపీఎల్ 2024 సీజన్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటకీ ఫ్రాంచైజీలు మాత్రం తమ కోచింగ్ స్టాఫ్ మార్పులపై అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది సీజన్ లో నిరాశపరిచిన కొన్ని జట్ల యాజమాన్యాలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాయి. జట్టు కంటే ముందు సపోర్టింగ్ స్టాఫ్ ను ప్రక్షాళన చేయనున్నాయి. దీనిలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) హెడ్ కోచ్ బ్రయాన్ లారా (Brian Lara)పై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

2023 ఐపీఎల్ సీజన్ కు ముందు టామ్ మూడీ నుంచి బాధ్యతలు తీసుకున్న లారా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగే విజయాలు సాధించింది. 10 మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళెవరూ ఆడలేదు. కోచ్ గా లారాపైనా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జట్టు యజమాని కావ్యా మారన్ కోచింగ్ స్టాఫ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది సీజన్ కు ముందు మార్పులు చేయాలని నిర్ణయించింది.

దీనిలో భాగంగా లారాను తప్పించి అతని స్థానంలో కొత్త కోచ్ ను నియమించాలని భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ కోచ్ కోసమే సన్ రైజర్స్ అన్వేషిస్తుండగా.. ఆండీ ఫ్లవర్ తో పాటు మరో విదేశీ మాజీ ఆటగాడు రేసులో ఉన్నట్టు సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ కు కోచ్ గా వ్యవహరించిన ఫ్లవర్ కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కోచ్ గా అతనికి ఉన్న సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డే దీనికి కారణం. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కరా కూడా ఆండీ ఫ్లవర్ ను ఖచ్చితంగా తీసుకోవాలని తమ ఫ్రాంచైజీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: ODI World Cup Squad: వరల్డ్ కప్ జట్టులో అతనుండాల్సిందే.. సెలక్టర్లకు దాదా కీలక సూచన..!

దీంతో సన్ రైజర్స్ కంటే రాయల్సే ఫ్లవర్ ను కోచ్ గా నియమించుకునే రేసులో ముందున్నట్టు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే మిగిలిన సపోర్టింగ్ స్టాఫ్ మార్పులపైనా సన్ రైజర్స్ యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ , స్పిన్ కోచ్ మురళీధరన్ లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా జట్టులో పలువురు ఆటగాళ్ల ప్రదర్శనపైనా సన్ రైజర్స్ యాజమాన్యం అసంతృప్తితో ఉంది. వచ్చే సీజన్ కు ముందే ట్రేడింగ్ విండో ద్వారా కొందరిని వదిలించుకోవాలని భావిస్తోంది. భారీ ధర పెట్టిన హ్యారీ బ్రూక్ , ఇంకా కొందరు విదేశీ క్రికెటర్లను పక్కన పెట్టే ఛాన్సుంది. గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన పేలవంగా ఉంది. చివరిసారి 2020 సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరిన సన్ రైజర్స్ గత మూడు సీజన్లలోనూ నిరాశపరిచింది. గత ఏడాది వేలంలో ఆ జట్టు వ్యూహాత్వకంగా తప్పిదాలు చేయడంపైనా విమర్శలు వచ్చాయి. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్ళను వేలంలో కోట్లు వెచ్చించి కొనడం, వారు పెద్దగా రాణించకపోవడంతో సన్ రైజర్స్ మూల్యం చెల్లించుకుంది.