Site icon HashtagU Telugu

Ind Vs Australia: సమం చేస్తారా… సమర్పిస్తారా ?

Match (1)

Match (1)

ఆసియా కప్ నుంచీ టీమిండియా తడబాటు కొనసాగుతోంది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాలు మూటగట్టుకుంటోంది. తాజాగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సీరీస్ ను ఓటమితో ఆరంభించింది. ఇప్పుడు సీరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉన్న వేళ రెండో మ్యాచ్ కు సిద్ధమయింది. నాగ్ పూర్ వేదికగా ఇవాళ జరగనున్న మ్యాచ్ లో ఒత్తిడంతా భారత్ పైనే. మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి.టీమిండియా గెలవాలంటే ఆసియా కప్‌ నుంచి కొనసాగుతున్న డెత్‌ ఓవర్ల ఆందోళనను అధిగమించాల్సి ఉంది. అయితే స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రానుండడం పెద్ద అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

బ్యాటింగ్ పరంగా భారత్ బలంగానే ఉంది. ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ గత మ్యాచ్ లో నిరాశ పరిచారు. అయితే సూర్యకుమార్‌ అదరగొడితే, హార్దిక్‌ పాండ్యా తన బ్యాటింగ్‌ సత్తాను చుక్కలతో చూపించాడు. ఇదే జోరు నాగ్‌పూర్‌లోనూ కొనసాగితే భారీస్కోరుకు తిరుగుండదు. మరోవైపు భారత్ డెత్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని మ్యాచ్ ల్లో ఈ బలహీనత కారణంగానే వరుస ఓటములు ఎదురయ్యాయి. దీంతో ఈ బలహీనత ను అధిగమించడం పైనే దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తొలి టీ ట్వంటీ లో భారీ స్కోరును చేధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు సీరీస్ విజయం పై కన్నేసింది. మెగా ఈవెంట్‌కు ముందు ఈ సిరీస్‌ గెలవాలని ఆశిస్తోంది. మొహాలిలో ఆసీస్‌ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం రాణించింది. ఓపెనర్ గ్రీన్ తో పాటు వేడ్ మెరుపులు ఆసీస్ కు విజయాన్ని అందించాయి.
కాగా బౌలింగ్‌కు సహకరించే నాగ్‌పూర్‌ పిచ్‌పై పరుగుల మోత ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వేదికపై 12 టి20 మ్యాచ్‌లు జరిగితే మొదట బ్యాటింగ్‌ జట్టు చేసిన సగటు స్కోరు 151 పరుగులుగానే ఉంది. దీంతో ఈ పిచ్ బ్యాటర్ల సత్తాకు పరీక్ష గా చెప్పొచ్చు.