Spin Challenge: కంగారూలకు స్పిన్ ఛాలెంజ్

ఏ పిచ్‌లైనా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండడం అనేది సర్వసాధారణం.. ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్లను పేస్ పిచ్‌లతో భయపెడితే...ఉపఖండంలో స్పిన్ పిచ్‌లు వారికి వెల్‌కమ్ చెబుతాయి.

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 06:29 PM IST

Spin Challenge: ఏ పిచ్‌లైనా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండడం అనేది సర్వసాధారణం.. ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్లను పేస్ పిచ్‌లతో భయపెడితే…ఉపఖండంలో స్పిన్ పిచ్‌లు వారికి వెల్‌కమ్ చెబుతాయి. గింగిరాలు తిరిగే బంతితో మన స్పిన్నర్లు కంగారూ బ్యాటర్లను ఆటాడుకుంటారు. మరోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్ పిచ్‌లే ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయి.
పెద్ద జట్ల మధ్య ఎక్కడ ఎప్పుడు టెస్ట్ సిరీస్ జరిగినా పిచ్‌లపైనే అందరి ఫోకస్ ఉంటుంది. పేస్ పిచ్‌లకు స్వర్గధామంగా ఆస్ట్రేలియా పిచ్‌లు ఉంటే…స్పిన్ పిచ్‌లకు కేరాఫ్ అడ్రస్ భారతే. ఇప్పుడు జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ స్పిన్ పిచ్‌లు, స్పిన్నర్లే కీలకం కానున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఏ ఆతిథ్య జట్టయినా తమకు అనుకూలంగా ఉండే పిచ్‌లు తయారు చేసుకుంటుంది. అయితే ఆసీస్ తరహాలో మరీ పూర్తిగా స్పిన్ పిచ్‌తోనే మ్యాచ్ గెలవాలనుకునే వ్యూహం భారత్‌కు లేదనే చెప్పాలి. సాధారణంగా భారత్‌లో పిచ్‌లు మొదటి రెండు,మూడు రోజులు బ్యాటర్లకు అనుకూలంగానే ఉంటాయి. ఫలితాన్ని డిసైడ్ చేసే చివరి రెండు రోజుల్లో మాత్రం స్పిన్నర్లకు ఫేవర్‌గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే విధంగా పిచ్‌లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

అయితే భారత్ గడ్డపై ఎదురయ్యే స్పిన్ ఛాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు ఈసారి ఆస్ట్రేలియా పకడ్బందీగా సిద్ధమవుతోంది. సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌ కూడా ఆడని కంగారూలు భారత స్పిన్నర్ అశ్విన్‌ తరహాలో బౌలింగ్ చేసే మహేశ్ ఫితియాతో నెట్ ప్రాక్టీస్ చేసింది. వార్మప్ మ్యాచ్ కూడా వద్దనుకున్న ఆస్ట్రేలియా ఆలూరులో స్పిన్ పిచ్‌లపై అతని బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసింది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్లు అంతా దాదాపు వారం రోజులు ఇతని బౌలింగ్‌లోనే సాధన చేశారు. తమకు ఎలానూ స్పిన్ పిచ్‌లే ఎదురవుతాయని తెలుసన్న ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్‌ దానికి తగ్గట్టుగానే సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులకూ ఆతిథ్యమిస్తున్న పిచ్‌లలో గత రికార్డుల పరంగా స్పిన్నర్లే ఎక్కువ శాతం^ఆధిపత్యం కనబరిచారు. సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఆసీస్ ప్రిపరేషన్ చూస్తుంటే ఈ సారి అంతగా తేలిగ్గా లొంగేలా కనిపించడం లేదు. తమకూ మ్యాచ్‌ను మలుపుతిప్పే స్పిన్నర్లున్నారంటూ ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు. నాథన్ ల్యాన్‌తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ టూర్‌కు వచ్చింది ఆసీస్‌. మొత్తం మీద స్పిన్నర్లే కీలకం కానున్న ఈ సిరీస్‌లో భారత్‌కే అడ్వాంటేజ్ ఉందన్నది విశ్లేషకుల అంచనా.