Site icon HashtagU Telugu

Boxing Day Test : ఆసీస్ గడ్డపై నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్

Nitish Kumar Reddy 100 Runs

Nitish Kumar Reddy 100 Runs

బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)తన మొదటి సెంచరీ (100 in 171 balls)సాధించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సీనియర్లు పెవిలియన్ చేరిన కష్ట పరిస్థితుల్లో నితీష్ నిలదొక్కుకుని సెంచరీ సాధించడం గర్వకారణం. ఇలాంటి సమయంలో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా, భారత జట్టుకు కీలక మద్దతుగా నిలిచింది.

నితీష్ కుమార్ రెడ్డి‌కి ఇదే తొలి టెస్ట్ సెంచరీ. గత మూడు టెస్ట్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న నితీష్.. తాజా మ్యాచ్‌లో మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో ఏకంగా సెంచరీనే సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి.. తనదైన బ్యాటింగ్‌తో 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కఠినమైన పిచ్‌పై మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు. భారత క్రికెట్‌కు కొత్త శక్తిగా భావిస్తున్న నితీశ్, భవిష్యత్తులో జట్టుకు కీలకంగా మారనున్నాడు. ఆటపట్ల ఉన్న ఆయన శ్రద్ధ, కఠోర శ్రమ ప్రతి యువ క్రికెటర్‌కి స్ఫూర్తిదాయకం. జట్టు విజయాల కోసం కలిసిచేరి ఆడే గుణం, ఇలాంటి అద్భుతాలు భవిష్యత్తులోనూ భారత క్రికెట్‌ను మరింత మెరుగుపరుస్తాయి. తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ, ఆయన ధైర్యం, పట్టుదల అద్భుతంగా కనిపించింది. సీనియర్ ఆటగాళ్లు త్వరగా అవుట్ అయిన ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించడమే కాకుండా, జట్టును విజయానికి చేరవేసేలా మద్దతు అందించాడు. సుందర్, బుమ్రా వెనువెంటనే ఔటవ్వడంతో నితీష్ కుమార్ రెడ్డి శతకంపై ఉత్కంఠ నెలకొంది. కానీ సిరాజ్ అద్భుతంగా మూడు బంతులు డిఫెన్స్ చేసి నితీష్‌ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. బోలాండ్ బౌలింగ్‌లో రెండు బంతులు డిఫెన్స్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మూడో బంతిని బౌండరీ తరలించి శతకాన్ని అందుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అతని తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. నితీష్ ఇన్నింగ్స్ చూసేందుకే వైజాగ్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లిన ముత్యాల రెడ్డి.. కొడుకు సక్సెస్‌ను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Read Also : Ratan Tata : ఇంత పెద్ద గ్రూప్‌కు యజమాని అయినప్పటికీ టాటా ఎందుకు అత్యంత ధనవంతుడు కాలేకపోయాడు..?