Temba Bavuma: సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా (Temba Bavuma) తన జట్టును అద్భుతంగా ముందుకు తీలుకెళ్తున్నాడు. తన కెప్టెన్సీలో సౌతాఫ్రికా అసాధారణ ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తుంది. తాజాగా పాకిస్థాన్ పై సౌతాఫ్రికా రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో సౌతాఫ్రికా కాలర్ ఎగురవేస్తూ తమ టెస్ట్ ర్యాంకింగ్స్ ని మెరుగు పరుచుకుంది. తొలిస్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో సౌతాఫ్రికా, మూడో స్థానంలో టీమిండియా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే బావుమా కెప్టెన్సీలో ఆ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో వరుస విజయాలను నమోదు చేసింది.
టెంబా బావుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 9 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 8 మ్యాచ్‌లు గెలవగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. గత 7 టెస్టు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా వరుసగా విజయం సాధించి సత్తా చాటింది. మరోవైపు బావుమా బ్యాటింగ్ తోనూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా పాక్ పై తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. ఓ వైపు బ్యాటింగ్, మరోవైపు అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో జట్టును నడిపిస్తున్నటెంబా బావుమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోనూ టెంబా బవుమా అద్భుతంగా రాణించాడు. ఓ వైపు కెప్టెన్ గా.. మరో వైపు బ్యాటర్ గా రాణిస్తూ సఫారీలకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
బావుమాను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం జరుగుతుంది. తన హైట్ ని కించపరుస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అయితే అవేం పట్టించుకోకుండా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. తన ప్రతిభతోనే విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. మొదట్లో తన కెప్టెన్సీపై కామెంట్స్ చేసిన వాళ్లే ఇప్పుడు తనని మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. ప్రతిభకు హైట్ అడ్డు కాదని బావుమా నిరూపించాడు.