India vs South Africa : సఫారీల జోరుకు బ్రేక్ వేస్తారా ?

భారత్ , సౌతాఫ్రికా రెండో టీ ట్వంటీకి అంతా సిద్ధమైంది. కటక్ బారాబతి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్ లో బౌలర్ల వైఫల్యంతో ఓడిన టీమిండియా సఫారీల జోరుకు బ్రేక్ వేయాలని ఎదురుచూస్తోంది

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 01:33 PM IST

 

భారత్ , సౌతాఫ్రికా రెండో టీ ట్వంటీకి అంతా సిద్ధమైంది. కటక్ బారాబతి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్ లో బౌలర్ల వైఫల్యంతో ఓడిన టీమిండియా సఫారీల జోరుకు బ్రేక్ వేయాలని ఎదురుచూస్తోంది. నిజానికి తొలి మ్యాచ్ లో బ్యాటర్లు అదరగొట్టారు. ఐపీఎల్ లో పెద్దగా రాణించని ఇషాన్ కిషన్ చెలరేగి ఆడితే.. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించారు. కెప్టెన్ పంత్ , హార్థిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించి భారీస్కోర్ అందించారు. అయితే బౌలర్లు చేతులెత్తేయడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అలాగే కీలక సమయంలో పేలవ ఫీల్డింగ్ కూడా పరాజయానికి కారణంగా చెప్పొచ్చు. దీంతో బౌలర్లు గాడిన పడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఐపీఎల్ లో నిలకడగా రాణించిన హర్షల్ పటేల్, భువనేశ్వర్ , అవేశ్ ఖాన్ కీలకమైన రెండో టీ ట్వంటీలో సత్తా చాటాలని భావిస్తున్నారు. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కాలంటే ఈ సిరీస్ లో నిలకడగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపైనే ఉంది. తొలి టీ ట్వంటీ భువితో పాటు అందరూ భారీగా పరుగులిచ్చేశారు. దీంతో లైన్ అండ్ లెంగ్త్ పై దృష్టి పెట్టకుంటే కష్టమనే చెప్పొచ్చు. అటు రిషబ్ పంత్ కెప్టెన్సీపైనా విమర్శలు వచ్చాయి. స్పిన్నర్ చాహల్ ను పూర్తి కోటా వేయించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రెండో టీ ట్వంటీ జరగనున్న కటక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండడంతో చాహల్ కీలకం కానున్నాడు. కాగా తుది జట్టులో మార్పులు చేయడంపై ద్రావిడ్ తర్జన భర్జన పడుతున్నాడు. హర్షల్ పటేల్ స్థానంలో అర్షదీప్ సింగ్,ఉమ్రాన్ మాలిక్ లలో ఒకరికి చోటు దక్కుతుందని భావిస్తున్నా… ద్రావిడ్ ఒక మ్యాచ్ తోనే హర్షల్ ను తప్పించడన్న వాదనా వినిపిస్తోంది.

మరోవైపు తొలి మ్యాచ్ గెలిచి జోరు మీదున్న సౌతాఫ్రికా సిరీస్ లో తమ ఆధిక్యం పెంచుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఐపీఎల్ ఫామ్ ఆ జట్టు క్రికెటర్లకు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా మిల్లర్, డస్సెన్ ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడడంతో 212 పరుగుల భారీ టార్గెట్ ను కూడా అలవోకగా ఛేదించేసారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. తొలి మ్యాచ్ గెలిచినప్పటకీ సౌతాఫ్రికా బౌలింగ్ కూడా తేలిపోయింది. దీంతో భారత్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయకుంటే సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బారాబతి స్టేడియం స్పిన్నర్లకే అనుకూలించనుండడంతో పరుగులు చేయడం బ్యాటర్లకు సవాల్ గానే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సిరీస్ కోసం బీసీసీఐ పలు ఆంక్షలు సడలించింది. అభిమానులను కూడా పూర్తి స్థాయిలో అనుమతించాలని నిర్ణయించడంతో టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కాగా తొలి టీ ట్వంటీ పరాజయానికి టీమిండియా రివేంజ్ తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.