IND Vs SA: క్యాచ్‌లు జారే.. మ్యాచ్ చేజారె.. వరల్డ్‌కప్‌లో భారత్‌కు తొలి ఓటమి.!

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ జోరుకు బ్రేక్ పడింది.

  • Written By:
  • Updated On - October 31, 2022 / 02:07 AM IST

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాటర్ల వైఫల్యంతో 133 పరుగులకే పరిమితమైంది. పేస్ పిచ్‌పై భారత స్టార్ బ్యాటర్లు నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ కెఎల్ రాహుల్ 9 రన్స్‌కే ఔటవగా.. రోహిత్‌శర్మ 15, కతోహ్లీ 12 రన్స్‌కే వెనుదిరిగారు.
దీప‌క్ హుడా డకౌటవగా.. ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా సూర్యకుమార్ యాద‌వ్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ వేగంగా పెంచాడు.

31 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్న సూర్యకుమార్‌, కార్తిక్‌తో క‌లిసి ఏడో వికెట్‌కు 52 ప‌రుగులు జోడించాడు. సూర్యకుమార్ 68 పరుగులకు ఔటవగా.. చివర్లో సఫారీ బౌలర్లు మరోసారి పైచేయి సాధించారు. సౌతాఫ్రికా బౌల‌ర్లలో లుంగీ ఎంగిడి నాలుగు నాలుగు వికెట్లు పార్నెల్ మూడు, నోర్జ్‌కు ఒక్క వికెట్ పడగొట్టారు.ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఆరంభంలో తడబడినా తర్వాత పుంజుకుంది. డేవిడ్ మిల్లర్, మక్‌రమ్ రాణించడంతో టార్గెట్‌ను ఛేదించింది. భారత పేలవ ఫీల్డింగ్ కూడా సఫారీ జట్టుకు కలిసొచ్చింది. పలు క్యాచ్‌లను వదిలేసిన భారత ఫీల్డర్లు, రనౌట్లు కూడా మిస్ చేశారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్‌ క్యాచ్‌ను కోహ్లీ వదలేయడం టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. అలాగే పలు రనౌట్లు కూడా మిస్ అవ్వడంతో స్కోరును భారత్ కాపాడుకోలేకపోయింది. సౌతాఫ్రికా విజయంతో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.