Site icon HashtagU Telugu

Saurav on Virat, Rohit: కోహ్లీ,రోహిత్ లకు దాదా సపోర్ట్

Virat

Virat

ఐపీఎల్‌-2022 సీజన్ లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లి దారుణంగా విఫలమవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ 153 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 9 మ్యాచుల్లో 121 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆట‌తీరుపై అంద‌రూ మండిపడుతుంటే.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వీరిద్ద‌రికి మ‌ద్ద‌తుగా నిలిచాడు. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి త్వ‌ర‌లోనే ఫామ్‌లోకి రావాల‌ని అత‌డు కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. వారు త్వరలోనే మళ్లీ ఫామ్‌ అందుకుంటారు. విరాట్ కోహ్లీ ఏ విషయంలో విఫలమవుతున్నాడో తెలియదు. చిన్న చిన్న త‌ప్పులు వ‌ల్ల కోహ్లి వికెట్‌ కోల్పోతున్నాడు.. తక్కువ స్కోర్లను భారీ ఇన్నింగ్స్‌గా మ‌ల‌చడానికి ప్ర‌యత్నించాలి. ఏదేమైనా కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి మంచి స్కోర్లు చేస్తాడని బలంగా నమ్ముతున్నానని గంగూలీ అన్నాడు.

రోహిత్ శర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్‌ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడ‌లేదు. కానీ అత‌డు ఒక్క అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఫామ్ అందుకుంటాడని భావిస్తున్నట్టు దాదా చెప్పుకొచ్చాడు. అయితే అత‌డు విఫలం కావ‌డం ముంబై ఇండియన్స్ జ‌ట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. అత‌డు ఫామ్‌లోకి రావ‌డం ముంబై ఇండియన్స్ జ‌ట్టుకు చాలా ముఖ్యమని గంగూలీ చెప్పాడు. సీజన్ ముగిసే సమయానికి వీరిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి రావాలని దాదా ఆకాక్షించాడు.