Saurav Ganguly: ఐసీసీ ఛైర్మన్ పదవా…అది నా చేతుల్లో లేదు

భారత క్రికెట్‌కు దూకుడు నేర్పించి విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 09:18 PM IST

భారత క్రికెట్‌కు దూకుడు నేర్పించి విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. నాయకత్వ లక్షణాల విషయంలో తనకు తానే సాటిగా ఎప్పుడో నిరూపించుకున్న దాదా గత కొంతకాలంగా బీసీసీఐలో తన మార్క్ చూపిస్తున్నాడు.

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌లోనూ, ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌గానూ దాదాగిరీ చూపిస్తున్న గంగూలీ ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో చక్రం తిప్పబోతున్నాడన్న చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. ఐసీసీ తర్వాతి ఛైర్మన్‌గా దాదా ఎంపిక ఖాయమే అన్న వార్తలూ షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా గంగూలీ స్పందించాడు. ఇవన్నీ ఊహాగానాలనీ, ఎవరికి నచ్చింది వాళ్లు రాసుకుంటున్నారన్నాడు. ఐసీసీ చీఫ్ అనే పదవి అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదన్నాడు. తాను రేసులో లేనంటూనే దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం తన చేతుల్లో ఏమీ లేదన్న గాగా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే ఈ విషయంలో ఫైనల్ అని స్పష్టం చేశాడు. దాదా కామెంట్స్ పై క్రికెట్ విశ్లేషకులు స్పందిస్తూ.. ఐసీసీ అధ్యక్ష పదవిని అధిరోహించడానికి దాదా రూట్ క్లీయర్ చేసుకుంటున్నాడని, అందుకే తన బాధ్యతను ప్రభుత్వం మీదకు నెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగియబోతోంది. తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు దాదా ప్రయత్నాలు చేస్తున్నాడు. బీసీసీఐ నిబంధనలు సవరించుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో తీర్పు వెలువడే అవకాశముంది. ఈ కారణంగానే అది నా చేతుల్లా లేదంటూ దాదా వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ బార్క్‌లీ పదవీకాలం నవంబర్‌తో ముగియనుండగా.. రేసులో గంగూలీ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.