Sourav Ganguly:ఇక ఐసీసీలో ‘దాదా’గిరీ

భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది గంగూలీనే.. ప్రత్యర్థి జట్లకు ఆటతోనే కాదు మాటలతోనూ ధీటుగా బదులిచ్చేలా జట్టును తయారు చేశాడు.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 05:51 PM IST

భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది గంగూలీనే.. ప్రత్యర్థి జట్లకు ఆటతోనే కాదు మాటలతోనూ ధీటుగా బదులిచ్చేలా జట్టును తయారు చేశాడు. అలాగే ఎంతోమంది యువ క్రికెటర్లు దాదా హయాంలోనే వెలుగులోకి వచ్చారు. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన గంగూలీ ఆ తర్వాత క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన గురువు జగన్మోహన్ దాల్మియా బాటలోనే పయనిస్తూ సేవలందిస్తున్నాడు.

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లోనూ, ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గానూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇక గంగూలీ దాదాగిరీ ఐసీసీకి చేరబోతోంది. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ ఛైర్మన్‌గా సౌరవ్‌ గంగూలీ ఎంపిక దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్‌ మ్యాగజైన్‌ స్పోర్ట్‌స్టార్‌ ఓ కథనంలో ప్రస్తావించింది. ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దాదా ఎంపిక లాంఛనమేనని స్పోర్ట్‌స్టార్‌ విశ్లేషించింది. రేసులో బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్ర క్రీడల మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఆనురాగ్‌ ఠాకూర్‌ పేర్లు ప్రముఖంగా వినిపించినా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు బీసీసీఐ వర్గాలు నిరాకరించాయి. అధ్యక్ష ఎన్నికకు సమయం చాలా ఉందని, ఇప్పటి నుంచే ఆ అంశంపై చర్చ అనవసరమంటూ బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

కాగా రేసులో మాత్రం దాదానే ముందున్నాడన్నది క్రికెట్ వర్గాల మాట. కాగా, ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్ల్కే పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పనిచేశారు. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, జగ్మోహన్ దాల్మియా, ఆ తరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్‌ ఐసీసీ చైర్మన్‌ హోదాలో పని చేశారు. వీరి తర్వాత మళ్ళీ గంగూలీనే ఆ పదవి వరించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదా పదవికాలం పొడిగింపు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. వచ్చే నెలలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.