ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడనుంది. అయితే గత 14 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డుల వచ్చాయి. వీటిలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టడం మాత్రం చాలా కష్టం అని చెప్పొచ్చు…మరి అలాంటి రికార్డులేంటో ఒకసారి చూద్దాం.
అత్యధిక వ్యక్తగత స్కోర్ క్రిస్ గేల్ (175 పరుగులు ) :
ఐపీఎల్ 2013 సీజన్ లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఐపీఎల్లో సరికొత్త రికార్డును సాధించాడు. పుణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్‌లో గేల్ కేవలం 66 బంతుల్లోనే 17 భారీ సిక్సర్లు, 13 ఫోర్లు సాయంతో 175 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుతోపాటు, అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అత్యధిక జట్టు స్కోరు (263 పరుగులు ):
ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2013 సీజన్ లో పుణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. అనంతరం పుణేను 133 పరుగులకే ఆలౌట్ చేసి ఆర్సీబీ.. 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అత్యల్ప టీమ్ స్కోర్ (49పరుగులు) :
ఐపీఎల్లో అత్యల్ప జట్టు స్కోరు రాయల్ చాలెంజర్ బెంగళూరు ఆర్సీబీ పేరిటే ఉంది. ఐపీఎల్ 2017 సీజన్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌటైంది.
కోల్ కత్తా వరుస విజయాలు :
ఐపీఎల్ లో రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2014-15 సీజన్లలో కలిపి వరుస విజయాలతో అదరగొట్టింది. ఐపీఎల్ 2014లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన కేకేఆర్ .. వరుసగా పదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.